నవతెలంగాణ-హైదరాబాద్ : మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదని, కానీ, అకారణంగా తొలగించడం బాధ కలిగిస్తోందని ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే లక్ష్యమని చెప్పారు. బర్తరఫ్ తర్వాత వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో తొలిసారిగా కొండా సురేఖ దంపతులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు.
‘‘ఎంపీపీ నుంచి మంత్రి స్థాయి వరకు వచ్చాను. కొందరు ఉదయం ఒకపార్టీలో ఉండి.. మధ్యాహ్నం మరో పార్టీలోకి వెళ్తున్నారు. మేం నమ్మిన రాజశేఖర్‌రెడ్డి కోసం గతంలో మంత్రి పదవికి రాజీనామా చేశా. కొందరు వార్డు మెంబర్‌గా కూడా రాజీనామా చేయరు. గతంలో కొందరు గుంటనక్కలు మాకు టికెట్ రాకుండా చేశారు. కాంగ్రెస్‌లో టికెట్ రాకపోతే.. కేసీఆర్ పిలిచి వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చారు. కేసీఆర్ టికెట్ ఇచ్చినందుకు నాడు మంత్రిగా ఉన్న వ్యక్తిని ఓడించాం. వరంగల్ ఈస్ట్‌లో మేం గెలిచినందునే ప్రజలు ప్రశాంత జీవితం గడిపారు. కొండా మురళి ఉన్నారనే ధైర్యంతో ఉండేవారు.
బర్తరఫ్ తర్వాత అల్లర్లు చేయాలా అని కొందరు మాకు ఫోన్ చేశారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారికి చెప్పాను. నా నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు. పదవులు ఇవాళ ఉంటాయి.. రేపు పోతాయి. పదవులు కాదు ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం. రేవంత్‌రెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేశారు. రేవంతన్నా.. నీలాంటి మాస్ లీడర్ కాంగ్రెస్‌కు అవసరమని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. అదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నాకు మంత్రి పదవి వచ్చింది. పదవి అనేది అలంకారమే.. పదవి లేకున్నా పనులు చేయొచ్చు. మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోం. ప్రజల్లోనే ఉంటాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుస్తాం’’ అని సురేఖ అన్నారు.



