Monday, August 31, 2026
E-PAPER
Homeమానవి‘మతోన్మాదులను జెన్‌‌జీ భరించదు’

‘మతోన్మాదులను జెన్‌‌జీ భరించదు’

- Advertisement -

ఐషీ ఘోష్‌… చారిత్రాత్మక జేఎన్‌‌యూ (జవహర్‌‌ లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో అధ్యక్షురాలిగా గెలిచిన చరిత్ర ఆమెది. ఇటీవల జంతర్‌ ‌మంతర్‌‌లో జరిగిన జెన్‌ జీ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించింది. ఎస్‌.ఎఫ్‌.ఐ అఖిల భారత సహాయ కార్యదర్శిగా విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తోంది. అమ్మాయిలను చదువుకు దూరం చేయాలని చూస్తున్న మనువాదులను సూటిగా ప్రశ్నిస్తోంది. అందుకే అత్యంత చిన్న వయసులోనే మతోన్మాదుల కంట్లో నలుసులా మారింది. పాలకులు దాడులకు తెగబడినా, అక్రమ అరెస్టులకు పాల్పడ్డా న్యాయం వైపే నిలబడింది. అన్యాయాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. జంతర్‌ ‌మంతర్‌ ఉద్యమంలో తన అనుభవాలను పంచుకునేందుకు దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె ఇటీవల హైదరాబాద్‌ ‌వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో మానవి ముఖాముఖి..

జంతర్‌ ‌మంతర్‌ ఉద్యమంలో అమ్మాయిల పాత్ర ఎలా ఉంది?
యువతుల భాగస్వామ్యం బాగా ఉంది. ఎందుకంటే విద్య ఎంతగా కార్పొరేటీకరణ చెందుతుందో అమ్మాయిలు అంతగా చదువుకు దూరమైపోతున్నారు. ఫీజులు పెరిగిపోతున్నప్పుడు తల్లి దండ్రులు చదువు విషయంలో అబ్బాయిలకు ఇచ్చినంత ప్రాధాన్యత అమ్మాయిలకు ఇవ్వరు. విద్యా కార్పొరేటీకరణ ప్రభావం అమ్మాయిల చదువుపై తీవ్రంగా పడుతుంది. మరీ ముఖ్యంగా ఉన్నత చదువుకులకు దూరమయ్యే అవకాశం చాలా ఉంటుంది. కష్టపడి కాస్తో కోస్తో చదువుకున్నా ఉపాధి దొరకడం లేదు. అందుకే విద్యా రంగాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత అమ్మాయిలపై చాలా ఉంది. ఆ బాధ్యతతోనే అమ్మాయిలు జంతర్‌ ‌మంతర్‌ ఉద్యమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. అంతేకాదు నేడు మనల్ని పాలిస్తున్న మతోన్మాదులు అమ్మాయిలను ఇంటికే పరిమితం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. మనువాదాన్ని ముందుకు తెచ్చి మహిళల స్వేచ్ఛను అణగదొక్కాలని చూస్తున్నారు. కనుక ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల్లో తమ ఉనికిని కాపాడుకోవల్సిన అవసరం కూడా అమ్మాయిలకు ఉంది. అందుకే దేశం పట్ల తమ బాధ్యతను చైతన్యంతో ప్రదర్శించారు. పోలీసుల, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌గుండాల దాడులను ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. దేశం మొత్తం అమ్మాయిల చైతన్యాన్ని చూసింది.

ఈ ఉద్యమంలో పాల్గొన్న అమ్మాయి గురించి చెడుగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇది ఉద్యమంపై ఏమైనా ప్రభావం పడిందా?
అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే జెన్‌ ‌జీకి పాలకుల వైఖరి అర్ధమయింది. మహిళలు ఉద్యమాల్లోకి వచ్చినప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు పాలకులు సహజంగానే వారి క్యారెక్టర్‌‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తారు. ఇది గతంలో కూడా మనం చాలా సార్లు చూశాం. షాహిన్‌‌బాగ్‌లో ఎన్‌ఆర్‌‌సీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అప్పుడు కూడా మహిళల గురించి ఇలాగో అనుచితంగా మాట్లాడారు. ఐదు వందల కోసం ఆశపడి ఉద్యమంలోకి వచ్చారని, బిర్యానీ కోసం వచ్చారంటూ అవహేళనగా చేశారు. అలాగే జంతర్‌ ‌మంతర్‌ ఉద్యమంలో పాల్గొన్న అమ్మాయిల గురించి కూడా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అమ్మాయిలు బయటకు వస్తే మన పాలకులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ముఖాలను మార్పింగ్‌ ‌చేసి తప్పుడు వీడియోలను బయటకు తెచ్చారు. కానీ వీటన్నింటినీ నేటి యువతరం ఒప్పుకోదు. మరీ ముఖ్యంగా అణిచివేతను జెన్‌ ‌జీ భరించడానికి సిద్ధంగా లేదు. కచ్చితంగా ఎదురు తిరుగుతుంది, ప్రశ్నిస్తుంది, తిప్పికొడుతుంది. అదే జంతర్‌ ‌మంతర్‌లో దేశం మొత్తం చూసింది. పాలకులు ఎంతగా అయితే ఉద్యమాన్ని అణచాలని చూశారో అంతగా యువత ఉవ్వెత్తున ఎగిసిపడింది.

ఈ ఉద్యమంలో ఎస్‌.ఎఫ్‌.ఐ పాత్ర ఏమిటి?
ఈ ఉద్యమం ఇలా సజావుగా సాగడంలో ఎస్‌ఎఫ్‌ఐ పాత్ర కీలకమైందిగా చెప్పుకోవచ్చు. సీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు మమ్మల్ని సంప్రదిస్తూనే ఉన్నారు. అందరం కలిసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాం. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత నాయకత్వంతో పాటు వామపక్ష పార్టీలు, అభ్యుదయ భావాలు కలిగిన వారు ఈ ఉద్యమానికి అండగా నిలిచారు. చివరకు విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించగలిగాం. అయితే ఈ రాజీనామాతోనే సమస్య పరిష్కారం అయినట్టు మేము అనుకోవడం లేదు. మొత్తం విద్యా విధానంలో మార్పు రావాలి. దేశంలోని ప్రతి పిల్లా, పిల్లవాడు తనకు నచ్చిన చదువు చదువుకోగలగాలి. అదే ఎస్‌.ఎఫ్‌.ఐ మొదటి నుండి కోరుకుంటుంది. దాన్ని సాధించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది.

మన పాలకులు దేశం అభివృద్ధి చెందుతుందని ఎంతో గొప్పగా ప్రచారం చేస్తున్నారు, కానీ ఉన్నత విద్యా రంగంలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కు వగా ఉంది. దీనికి కారణం ఏమిటంటారు?
ఎస్‌.ఎఫ్‌.ఐ ఒక్కటే చెబుతుంది. అమ్మాయిలు ఉన్నత విద్యను అభ్యసించాలంటే ప్రభుత్వ విధానాల్లో మార్పు రావడమే దీనికి పరిష్కారం. బేటీ బచావో, బేటీ పడావో అంటూ కేవలం నినాదాలు చేస్తే సరిపోదు. అది ఆచరణలో చూపించాలి. అసలు మన పాలకులకు మహిళల పట్ల గౌరవమే లేదు. ఉమెన్‌ ‌రిజర్వేషన్‌ ‌బిల్లు పాస్ చేసినట్టే చేశారు. కానీ దాన్ని అమలు చేయడానికి వీలు లేకుండా అనేక అడ్డంకులు పెట్టారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు మహిళల పట్ల ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పడానికి. వాళ్ల సొంత ప్రచారాల కోసం కోట్లు ఖర్చుపెడతారు. కానీ అమ్మాయిల చదువు కోసం ముందుకురారు. ఈ ఆగస్టు నెలలోనే నేను ఏడెనిమిది రాష్ట్రాల్లో పర్యటించారు. కానీ ఎక్కడా కూడా మన పాలకులు ఆడపిల్లల చదువు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే వాళ్ల బీజేపీ గురించి మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. స్కాలర్‌షిప్‌‌లు విడుదల చేయరు. మధ్యాహ్న భోజన పథకాన్ని సరిగ్గా అమలు చేయరు. ‘మీ ఆడపిల్లల్ని చదివించండీ, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని ప్రభుత్వం తల్లిదండ్రులకు భరోసాను ఇవ్వాలి. కానీ అది మన పాలకులు చేయడం లేదు. నిజంగా మన పాలకులకు అమ్మాయిల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే అందరికీ విద్య అందుబాటులోకి తీసుకురావాలి. విద్యా కార్పొరేటీకరణను ఆపెయ్యాలి. అప్పుడే అమ్మాయిలు స్వేచ్ఛగా చదువుకోగలరు.

జంతర్‌ ‌మంతర్‌ ‌తర్వాత వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కలిసి ఏమైనా పోరాటానికి ప్లాన్‌ ‌చేస్తున్నారా?
భవిష్యత్తులో అందరం కలిసి ఉద్యమాలు చేసే ఆలోచనల్లో ఉన్నాము. ప్రస్తుతం ‘బడులను కాపాడండి’ అనే నినాదంతో ప్రతి రాష్ట్రంలో పర్యటిస్తున్నాం. ఇందులో సీజేపీతో పాటు అన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు భాగస్వామ్యమ య్యాయి. విద్యా రంగంలో ఓ మంచి మార్పు వచ్చే వరకు ఈ ఐక్య ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. ఎస్‌.ఎఫ్‌.ఐ ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది.

మీపై ఇప్పటికే రెండు సార్లు దాడులు జరిగాయి. మరి ఇంట్లో మీకు మద్దతు ఉందా?
మద్దతు అయితే ఉంది. అయితే కొంత భయం కూడా ఉంటుంది. ఇది సహజం కదా! నా గురించి దిగులుపడుతుంటారు. అయితే వాళ్లకు నాపై ఓ నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి నాలో ప్రశ్నించేతత్వం ఎక్కువ. ఎక్కడ అన్యాయం జరిగినా కచ్చితంగా స్పందిస్తాను. ఇంట్లో కూడా నేను అన్యాయాన్ని సహించను. అమ్మా నాన్న నన్ను అలాగే పెంచారు. కాబట్టి ఎక్కడ ఉన్నా న్యాయం వైపు ఉంటాను, ధైర్యంగా ఉంటాను, ఎస్‌.ఎఫ్‌.ఐ నాకు తోడు ఉంది అనే నమ్మకం వాళ్లకు ఉంది. కాబట్టే ఇంత స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాను.

మీ కుటుంబం గురించి చెప్పండీ?
నేను పుట్టింది పెరిగింది పశ్చిమబెంగాల్‌‌లోని పశ్చిమ్ వర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్ నగరంలో అమ్మ శర్మిష్టా ఘోష్‌, గృహిణి. నాన్న దెబాశిష్‌ ‌ఘోష్‌. దామోదర్ వ్యాలీలో ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యారు. సీఐటీయూలో పని చేశారు. మొదటి నుండి బెంగాల్‌ ‌వామపక్ష ఉద్యమాల ప్రభావం మా కుటుంబంపై చాలా ఉంది. సీపీఐ(ఎం)లో పని చేశారు. వారిచ్చిన ప్రోత్సాహంతోనే నేను కూడా మొదటి నుండి బాలల సంఘంలో, ఆ తర్వాత విద్యార్థి సంఘం(ఎస్‌.ఎఫ్‌.ఐ)లో పని చేస్తున్నా ను. ప్రస్తుతం జేఎన్‌‌యూలో ‘ఉమెన్‌ ఇన్‌ ‌హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌ ఉజ్బెకిస్తాన్‌‌’ అనే అంశంపై పీహెచ్‌‌డీ చేస్తున్నాను.
– సలీమా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -