Sunday, September 20, 2026
E-PAPER
Homeమానవిఅండాశయంలో నీటితిత్తులా..?

అండాశయంలో నీటితిత్తులా..?

- Advertisement -

పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీఎంఓఎస్‌). ఇటీవల కాలంలో మహిళలను ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. అయితే చాలా మంది ఇది కేవలం ఒక్క అండాశయ తిత్తులకే పరిమితం అనుకుంటారు. కానీ ఈ సమస్య శరీరం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు పీసీఓఎస్‌గా పిలుచుకునే ఇది హార్మోన్లు, జీవక్రియలతో ముడిపడిన సమస్య అని వైద్యులు అంటున్నారు. రుతుక్రమం, సంతాన సమస్యలతో పాటు డయాబెటిస్ వంటి దీర్ఘకాల జబ్బుల ముప్పూ పెరిగేలా చేస్తుంది. మరి ఈ సమస్య పరిష్కారం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…

పీఎంఓఎస్‌ అనగానే చాలామంది తిత్తుల గురించే ఆందోళన చెందుతుంటారు. వాస్తవానికి, అండాశయాలు అవసరానికి మించి హార్మోన్లను విడుదల చేయడం వల్ల తలెత్తే సమస్య అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మెదడు, అండాశయాల్లో పుట్టుకొచ్చే హార్మోన్ల మధ్య పరస్పర సంబంధం కీలకపాత్ర పోషిస్తుంది. ముందుగా మెదడులోని హైపోథలమస్ నుంచి విడుదలయ్యే గొనడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ పీయూషగ్రంథిని ప్రేరేపిస్తుంది. అప్పుడు ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ పుట్టుకొచ్చి, అండాశయాలను ఉత్తేజితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు తయారవుతాయి.

అందరిలో ఉండవు
ఈస్ట్రోజన్ ఒక స్థాయికి చేరుకోగానే పీయూషగ్రంథి ల్యూటినైజింగ్ హార్మోన్​ను ఉత్పత్తి చేసి, అండం విడుదలను ప్రేరేపిస్తుంది. ఈస్ట్రోజన్ మరీ ఎక్కువగా ఉత్పత్తి అయితే హార్మోన్ల సమాచార వ్యవస్థ కుంటుపడుతుంది. ల్యూటినైజింగ్ హార్మోన్ పెరిగితే టెస్టోస్టిరాన్ వంటి మగ హార్మోన్ల మోతాదులు ఎక్కువవుతాయి. ఇవి అండాశయాల్లో అండాలు పరిపక్వమవటాన్ని, విడుదల కావటాన్ని అడ్డుకుంటాయని కూడా నిపుణులు వివరిస్తున్నారు. ఇలా పరిపక్వం కాని అండాలే బుడిపెలు బుడిపెలుగా.. నీటి తిత్తుల్లా కనిపిస్తాయని తెలియజేస్తున్నారు. అయితే పీఎంఓఎస్‌ గల అందరిలోనూ తిత్తులు ఉండాలనేమీ లేదని చెబుతున్నారు.

ఇతర సమస్యలూ?
పీఎంఓఎస్‌ సమస్య ఉన్న అందరిలో తిత్తులు ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. వీరిలో మగ హార్మోన్లు పెరగటం, రుతుక్రమం అస్తవ్యస్తం కావటం, అండం విడుదల కాకపోవటం.. వంటి సమస్యలూ కనిపిస్తుంటాయి. వీటి తీరును బట్టి పీఎంఓఎస్‌ను నాలుగు రకాలుగా (ఎ, బి, సి,డి) చెప్పుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఎ రకంలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి సరిగా అవకపోవటం, అండాశయాల మీద తిత్తులు అన్నీ ఉంటాయి. బీపీ, బరువు, రక్తంలో ట్రైగ్లిజరైడ్లు కూడా పెరుగుతాయి. బి రకంలో తిత్తులు సృష్టంగా ఉండవు. మగ హార్మోన్లు పెరుగుతాయని, అండం విడుదల కాదు. సి రకంలో అండం బాగానే విడుదలవుతుంది. కానీ, మగ హార్మోన్లు పెరుగుతాయి. తిత్తులు స్పష్టంగా ఉంటాయి. చాలా వరకూ ఇది సంతాన పరీక్షల సమయంలో బయటపడుతుంది. డి రకంలో మగ హార్మోన్ల లక్షణాలేవీ ఉండవు. కానీ, నెలసరి సరిగా రాదు. తిత్తులు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు.

నిర్ధారణ ఇలా
చాలా వరకూ లక్షణాలను బట్టే పీఎంఓఎస్‌ను అంచనా వేస్తారు. హార్మోన్లు, గ్లూకోజు మోతాదులు తెలుసుకోవటానికి కొన్ని రక్త పరీక్షలు అవసరమవుతాయి. అల్ట్రాసౌండ్ స్కాన్​లో తిత్తులు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి 2-9 మి.మీ. సైజులో 20 కన్నా ఎక్కువగా ఉంటే సమస్యగా నిర్ధారిస్తారు. అయితే రజస్వల అయ్యాక 18 ఏళ్లు వచ్చేంత వరకూ నిర్ధారించటం సరైనది కాదని నిపుణులు అంటున్నారు.

ఇన్సులిన్ నిరోధకతతోనే
పీఎంఓఎస్‌ ఇబ్బందులకు ప్రధాన కారణం కణాలు ఇన్సులిన్​కు సరిగా స్పందించకపోవ టమని (ఇన్సులిన్ నిరోధకత) కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో కణాల్లోకి గ్లూకోజు సరిగా వెళ్లదని నిపుణులు అంటున్నారు. ఇలా కణాలు స్పందించనప్పుడు శరీరం మరింత ఇన్సులిన్​ను విడుదల చేస్తుంది. ఇది అండాశయ హార్మోన్ల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తు న్నారు. మగ హార్మోన్ల ఉత్పత్తీ ప్రేరేపితమవుతుందని తెలియజేస్తున్నారు. ఇన్సులిన్ నిరోధకత బరువు పెరగటానికీ దారితీస్తుంది. దీని మూలంగా రక్తంలో గ్లూకోజ్ మోతాదులు క్రమంగా పెరుగుతూ, డయాబెటిస్ తలెత్తే అవకాశం ఉంటుంది. ఒక్క డయాబెటిస్​ ముప్పే కాదు, అధిక బరువు, ట్రైగ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ పెరగటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశమూ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

లక్షణాలు, ఇబ్బందులు
సమయానికి పీరియడ్స్ రాకపోవటం. ఒకవేళ వస్తే రుతుస్రావం ఆగదు లేదా కొంచెం కొంచెం కనిపించొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే బరువు పెరగటం, ఒబెసిటీ, గర్భధారణలో ఇబ్బంది, మొటిమలు, గడ్డం, మీసం, కాళ్లూ, చేతుల వంటి భాగాల్లో వెంట్రుకలు మొలవటం, జుట్టు ఊడిపోవటం, మెడ చుట్టు పక్కల, చంకలు, గజ్జల్లో చర్మం నల్లబడటం, నిస్సత్తువ, మూడ్ మారటం చర్మం మీద సన్న కాయల వంటివి మొలవటం.

మందులతో…
కాస్త చిన్నవయసు వారికి పీరియడ్స్ సక్రమంగా రావటానికి హార్మోన్ మాత్రలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్​లో వాడే మెట్​ఫార్మిన్ ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుందని, గర్భధారణ అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. చిక్కుళ్లు, ధాన్యాలు, బాదం వంటి వాటిల్లో ఉండే ఇనోసిటాల్స్​ మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. ఇన్సులిన్ నిరోధకత తగ్గటానికి, నెలసరి సమయానికి రావటానికి, అండాశయాలు సరిగా పనిచేయటానికి తోడ్పడతాయని తెలియజేస్తున్నారు. బరువు తగ్గుతారని వివరిస్తున్నారు. అవసరమైతే వీటిని మందుల రూపంలో తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. థైరాయిడ్ జబ్బు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉంటే తగిన చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. కొందరికి మగ హార్మోన్ల ప్రభావాన్ని నిలువరించే మందులు అవసరమవుతాయని సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా సమస్య ఉన్నప్పుడు వైద్యుల సలహాతోనే మందులు వాడాలి.

జీవనశైలితో అడ్డుకట్ట
వాస్తవానికి పీఎంఓఎస్‌ తల్లి కడుపులో ఉండగానే నిర్దేశితమై ఉంటుంది. దీనికి రకరకాల జన్యువులు కారణమవుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఉన్నా పీఎంఓఎస్‌ రావాలనేమీ లేదని అంటున్నారు. అతిగా తినటం, శారీరక శ్రమ చేయకపోవటం వంటివి జన్యువులను ప్రేరేపించి సమస్యకు దారితీస్తుంటాయి. కాబట్టి జీవనశైలి మార్చుకోవటం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. పొట్టలో కొవ్వు, బరువు తగ్గితే దాదాపు అన్ని సమస్యలూ తగ్గుతాయవి వివరిస్తున్నారు. అందువల్ల క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, సమతులాహారం తినటం వంటి జీవనశైలి మార్పులతో బరువు తగ్గించుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -