Saturday, September 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఫోన్‌.. అవసరమా? వ్యసనమా?

ఫోన్‌.. అవసరమా? వ్యసనమా?

- Advertisement -

ఇటపిల కాలంలో ఫోన్‌ ‌వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అనివార్యంగా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికీ అందరూ ఫోన్‌‌పైనే ఆధారపడుతున్నారు. నిజానికి ఫోన్‌ ‌గురించి మాట్లాడుకోవాలంటే కరోనాకు ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవచ్చు. కరోనా సమయంలో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఫోన్లకు అలవాటు పడిపోయారు. అంతేకాదు వ్యాపార లావాదేవీలు అన్నీ ఫోన్‌‌తోనే ముడిపడిపోయాయి. కరోనా సమయంలో అంటే తప్పని పరిస్థితుల్లో వాడాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా చాలా మంది ఫోన్‌‌కి బానిసలైపోయారు. దీనివల్ల కుటుంబాల్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. అలాంటి ఓ కథనమే ఈ వారం ఐద్వా అదాలత్‌ (ఐలమ్మ ట్రస్ట్‌)‌లో చదవండీ…

దీపికకు రెండేండ్ల కిందట కృష్ణతో పెండ్లి జరిగింది. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇంట్లో వీరితో పాటు అత్త కూడా ఉంటుంది. దీపికకు 26 ఏండ్లు, కృష్ణకు 32 ఏండ్లు. ఇద్దరి మధ్య ఆరేండ్ల తేడా ఉంది. దీపికకు అప్పుడప్పుడు భర్తతో కలిసి బయటకు వెళ్లాలని, సరదాగా కొంత సమయం గడపాలని ఉంటుంది. కానీ కృష్ణ మాత్రం ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. అతనికి పెద్దగా స్నేహితులు కూడా లేరు. ఎక్కడికైనా వెళదామంటే ఆసక్తి చూపించడు. బయటకు వెళ్లినపుడు ఏమైనా తిందామన్నా పట్టించుకోడు. ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చుకోలేక దీపిక చాలా ఇబ్బందులు పడుతుంది. పైగా కృష్ణ ఎప్పుడూ ఫోన్‌ ‌చూస్తూ గడిపేస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఐద్వా లీగల్‌‌సెల్‌కు వచ్చి తన బాధలు చెప్పుకుంది. ‘మేడమ్‌, మా అత్తయ్య, ఆడపడుచు, తోటి కోడళ్లు వీళ్లు ఎవరూ నన్ను ఏమీ అనరు. ఇంకా వీళ్లే మా వారితో బయటకు వెళ్లిరండీ అని చెబుతుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత మీరు వెళ్లాలన్నా వెళ్లలేరు అని కూడా చెబుతారు. కానీ ఇవేవీ కృష్ణ పట్టించుకోడు. అసలు ఆయనకు బయటకు వెళ్లటమే ఇష్టం వుండదు. ఏదైనా ఇంట్లోనే అంటాడు. ఎవరితోనూ సరదాగా మాట్లాడడు. కుటుంబ సభ్యులతో మాత్రమే మాట్లాడతాడు. కనీసం బంధువులతో కూడా కలుపుగోలుగా ఉండడు.

కరోనా కంటే ముందు బయటకు వెళ్లడం, తినడం లాంటివి చేసేవాడంట. కానీ కరోనా తర్వాత బయటకు వెళ్లడం చాలా వరకు తగ్గించేశాడు. కానీ ఫోన్‌ ‌మాత్రం బాగా చూస్తాడు. ఇప్పుడు నా సమస్య కూడా ఫోన్‌ ‌గురించే. ఫోన్‌‌ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అతనికి నాకన్నా ఫోనంటేనే ఇష్టం అనిపిస్తుంది. 24 గంటలు ఫోన్‌ ఆయన పక్కన ఉండాల్సిందే. నిద్రలేవగానే మెసేజ్లు, చాటింగ్‌‌లు మొదలుపెడతాడు. గేమ్స్‌ ఆడుతుంటాడు. కనీసం అన్నం తినడానికి కూడా రాడు. మేమే బలవంతంగా తినిపించాల్సి వస్తుంది. మా అత్తయ్యే ఆయనకు అన్నం తినిపిస్తుంది. ఆయనతో ఏమైనా మాట్లాడదామంటే ఎప్పుడూ ఫోన్‌ ‌చూస్తూనే ఉంటాడు. ఇలా ఆయన ఫోన్‌‌కి పూర్తిగా బానిసైపోయాడు. ఫోనే ప్రపంచంగా మారిపోయింది. బయట ప్రపంచంతో అసలు సంబంధమే లేదు. నాకేమో ఆయనతో కొంత సమయం గడపాలని, సరదాగా మాట్లాడాలని, బయటకు వెళ్లాలని ఉంటుంది. నాతో మాట్లాడేటప్పుడు కూడా ఫోనే చూస్తుంటాడు. మీరే నా సమస్యకు పరిష్కారం చూపించండీ’ అన్నది.

మేము ఫోన్‌ ‌చేసి కృష్ణను పిలిపించాము. అతనితో మాట్లాడితో ‘నేను ఫోన్‌ ఎక్కడ చూస్తున్నాను? ఉదయం వెళ్లి ఎప్పుడో సాయంత్రం వస్తాను. ఫోన్‌ ‌చూస్తూ టైం పాస్‌ ‌చేయను నేను. మాకు ఇప్పుడంటే పిల్లలు లేరు. భవిష్యత్తులో పిల్లలు పుడితే ఖర్చులు పెరిగిపోతాయి. వాటికి తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగంతో పాటు ఆన్‌‌లైన్‌ ‌జాబ్‌ ‌చేయడానికి అవసరమైన స్కిల్క్‌ ‌నేర్చుకుంటున్నాను. రీ సేలర్‌‌గా చేస్తున్నాను. అందుకే ఫోన్‌ ‌చూస్తుంటాను. అంతే తప్ప ఫోన్‌‌లో ఏవేవో చూస్తూ టైంపాస్‌ ‌చేయడం లేదు. రీసేలింగ్‌‌కి ఎవరు ఎప్పుడు ఆర్డర్‌ ‌పెడతారో తెలియదు. కాబట్టి ఎప్పుడూ ఫోన్‌ ‌పక్కనే పెట్టుకొని చెక్‌ ‌చేస్తుండాలి. పొద్దున్నే లేవగానే చూస్తాను. నేను డబ్బు సంపాదించడం కోసం కష్టపడుతుంటే దీపిక నన్ను ఇలా అర్థం చేసుకుంటుంది. అయితే అప్పుడప్పుడు రిలీఫ్‌ ‌కోసం గేమ్‌ ఆడుకుంటాను. ఆఫీసు నుండి ఇంటికి రాగానే స్నేహితులు అదీ ఇదీ అని బయటకు వెళ్లను. అమ్మతో కొద్దిసేపు ఉండి ఆ తర్వాత ఫోన్‌‌లో క్లాసులు వింటాను. కొత్త వాళ్లతో నేను అంత త్వరగా కలవలేను. కానీ ఎవరైనా ఇంటికి వస్తే వాళ్లకేం కావాలన్నా తీసుకొస్తాను. మా అక్క, మేనకోడలితో మాత్రం చాలా ప్రేమగా ఉంటాను. ఇతరులతో అయితే మాట్లాడలేను.
దీపిక నేమో అందరితో మంచిగా మాట్లాడొచ్చుకదా అని తిడుతుంది.

అంతెందుకు మా బావ వచ్చినా నేను పెద్దగా మాట్లాడను. బాగోదని ఏవో రెండు మూడు మాటలు మాట్లాడతాను అంతే. మా అక్క పెండ్లి జరిగి 25 ఏండ్లు అవుతుంది. కానీ ఇప్పటి వరకు మా బావ నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. నన్ను అర్థం చేసుకున్నాడు. మా అక్కనే మా ఇద్దరినీ రెండు మూడు సార్లు బయటకు తీసుకెళ్లింది. అప్పుడప్పుడు బయటకు వెళ్లమని అక్క చెబుతూనే ఉంటుంది. ఈ మధ్యనే కేరళ వెళ్లి రమ్మని టికెట్లు కూడా బుక్‌ ‌చేసింది. రెండు రోజుల ముందు దీపికకు చెప్పి సర్‌‌ప్రైజ్‌ ‌చేయమంది. అందుకే చెప్పలేదు. ఈలోపే తను మీ దగ్గరకు వచ్చింది. ఇందులో నేను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదు. మరో ఆరు నెలల్లో ఆన్‌‌లైన్‌ ‌క్లాసులు అయిపోతాయి. దీపికను రీసేలింగ్‌ ‌చేయమంటే చేయనంటుంది. అందుకే నేనే చేస్తున్నాను’ అన్నాడు. దాంతో మేము దీపికతో ‘నీ భర్త అన్‌‌లైన్‌‌లో క్లాసులు వింటున్నాడా’ అని అడిగితే. దానికి అతను ‘నాపై నమ్మకం లేకపోతే నా ఫోన్‌ ‌తీసుకొని చెక్‌ ‌చేసుకోండి’ అన్నాడు. వెంటనే దీపిక ‘నాకు ఈ విషయం గురించి తెలియదు మేడమ్‌, లేదంటే ఇంత వరకు వచ్చేదాన్నే కాదు. ఆఫీసు నుండి రాగానే ఓ అరగంట రెస్టు తీసుకుంటాడు. తర్వాత ఫోన్‌ ‌చూస్తూ కూర్చుంటాడు’ అంది.

దానికి మేము కృష్ణతో ‘నువ్వు ఫోన్‌‌లో ఏం చేస్తున్నావో నీ భార్యకు చెప్పాలి కదా? చెప్పకపోతే ఇలాగే అపార్థం చేసుకుంటుంది. అయినా ఎంత డబ్బు సంపాదించినా మీరు సంతోషంగా ఉండడం కోసమే కదా? పిల్లల కోసం సంపాదించడం మంచిదే, కానీ ముందు మీరు సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ ఆన్‌‌లైన్‌ ‌కాస్లలు, బిజినెస్‌ అంటూ ఫోన్‌ ‌చూస్తూ కూర్చుంటే మీ మధ్య మంచి రిలేషన్‌ ఎలా ఉంటుంది. రోజులో కనీసం ఓ గంట అయినా నీ భార్య కోసం కేటాయించు. అప్పుడే నీ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. మీ అక్క చెప్పినట్టు రేపు పిల్లలు పుడితే మీకంటూ ప్రత్యేకంగా సమయం కేటాయించుకోవడం కష్టం. అందుకే ఇప్పుడే కాస్త సరదాగా గడపండి’ అని చెప్పి పంపించాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -