వైమానిక దాడుల్లో 11 మంది మృతి
హిజ్బుల్లా దాడులకు ప్రతీకారంగా దాడులు
లెబనాన్‌కు అండగా ఉంటామన్న ఇరాన్
నబాటిహ్ : లెబనాన్‌పై ఇజ్రాయిల్ సైన్యం విరుచుకుపడింది. దక్షిణ లెబనాన్‌లోని వివిధ ప్రాంతాలపై భీకర వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 11 మంది మృతిచెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. హిజ్బుల్లా జరిపిన దాడుల్లో తమ దేశానికి చెందిన ముగ్గురు సైనికులు గాయపడినట్టు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించిన లెబనాన్‌లోని నబాటిహ్ జిల్లాలో గల అన్సార్, డెయిర్ ఎజ్-జహ్రానీ ప్రాంతాలను ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకుని శనివారం తెల్లవారుజామున విరుచుకుపడ్డాయి. అన్సార్‌లో ఒక నివాస గృహంపై జరిపిన క్షిపణి దాడిలో ముగ్గురు చిన్నారులతో సహా ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. అలాగే డెయిర్ ఎజ్-జహ్రానీలో జరిగిన మరో వైమానిక దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 17 మంది తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా రాసుకొచ్చింది. లెబనాన్‌పై దాడులతో పాటు పౌరులు మృతి చెందిన విషయాన్ని ఇజ్రాయిల్ సైన్యం ధ్రువీకరించింది. అయితే, హిజ్బుల్లానే ఉద్దేశపూర్వకంగా ఆ సైనిక శిబిరాల్లో పౌరులను ఉంచిందని ఐడీఎఫ్ ఆరోపించింది. మృతి చెందిన మహిళలు, పిల్లలు ఒక సీనియర్ హిజ్బుల్లా కమాండర్ కుటుంబ సభ్యులని ఇజ్రాయిల్ మీడియా పేర్కొంది.
లెబనాన్ – ఇజ్రాయిల్ మాటల యుద్ధం
జూన్ లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్ , లెబనాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే తాజాగా ఇజ్రాయిల్ సైనికులపై హిజ్బుల్లా దాడులకు పాల్పడడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు. లెబనాన్ ఒప్పందం ఉల్లంఘించిందని మండిపడ్డారు. మరోవైపు, ఇజ్రాయిల్ చర్యలపై లెబనాన్ తీవ్రంగా స్పందించింది. త్వరలో అమెరికా ఆధ్వర్యంలో లెబనాన్-ఇజ్రాయిల్ మధ్య కీలకమైన చర్చలు జరగనున్నాయని పేర్కొంది. ఆ చర్చల వేళ తమను బెదిరించేందుకే ఈ దాడులు చేసిందని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆరోపించారు.
ఇజ్రాయిల్ చర్యలు చట్టాల ఉల్లంఘనే: ఇరాన్
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన వైమానిక దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్ చర్యలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. లెబనాన్ జాతీయ సార్వభౌమత్వాన్ని కాలరాసేలా ఉన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడడంపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘయీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ చేపట్టిన ఈ క్రూరమైన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దాడుల వల్ల నివాస ప్రాంతాలు, సివిలియన్ భవనాలు నేలమట్టమయ్యాయని బఘయీ తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో లెబనాన్ ప్రజల ప్రతిఘటనను ఆయన ప్రశంసించారు. లెబనాన్ స్వాతంత్య్రం, గౌరవాన్ని కాపాడుకోవడంలో ఆ దేశానికి ఇరాన్ ఎప్పుడూ సంపూర్ణ సంఘీభావం, మద్దతు ఇస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ అరాచకాలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనుసరిస్తున్న మౌనం అత్యంత శోచనీయమని అన్నారు. అంతర్జాతీయ చట్టాలను, మానవతా సూత్రాలను ఇజ్రాయిల్ బహిరంగంగా ఉల్లంఘిస్తున్నా పెద్ద దేశాలు, అంతర్జాతీయ సంస్థలు స్పందించకపోవడం దారుణమని బఘాయి తెలిపారు.
గాజాలోనూ ఉద్రిక్తతలు
లెబనాన్‌తో పాటు గాజా స్ట్రిప్‌లోనూ ఇజ్రాయిల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం దక్షిణ గాజాలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ ఖాన్ యూరిస్ బ్రిగేడ్ కంపెనీ కమాండర్ హుదైఫా ఖాలెద్ సులేమాన్ కవారీ హతమైనట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. హమాస్‌కు శిక్షణ ఇవ్వడం, సరిహద్దుల గుండా ఆయుధాలను రవాణా చేయడం, ఉగ్రవాద సంస్థ సైనిక సామర్థ్యాలను పునరుద్ధరించడంలో కవారీ కీలక పాత్ర పోషించినట్టు ఇజ్రాయిల్ పేర్కొంది.



