Monday, August 17, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుభావి భారత నిర్మాతలు మహిళా ఉపాధ్యాయులే

భావి భారత నిర్మాతలు మహిళా ఉపాధ్యాయులే

- Advertisement -

వారి బాధ్యతలు సరే..హక్కుల మాటేమిటి?
⁠రాజ్యాంగం, రాజకీయాల పట్ల మహిళలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి
సంఘాలుగా ఏర్పడాలి..హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి
⁠టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయుల సదస్సులో వక్తలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేటి బాలబాలికలకు విద్యా బుద్ధులు నేర్పి వారిని భావిభారత పౌరులుగా తీర్చి దిద్దే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేననీ, మరీ ముఖ్యంగా మహిళా ఉపాధ్యా యులదేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి మహిళా ఉపాధ్యాయుల సదస్సు నిర్వహించారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సిహెచ్.దుర్గా భవాని అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జి.రాధారాణి, ఐద్వా జాతీయ ఉపాధ్యక్షురాలు మరియం ధావలే ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ జి.రాధారాణి మాట్లాడుతూ రిజర్వేషన్లు అమలు చేసిన రాష్ట్రాల్లోని న్యాయవ్యవస్థల్లో మహిళల సంఖ్య పెరిగిందని తెలిపారు. ఉద్యోగాల్లో చేరిన మహిళలు తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. నేటికీ ప్రయివేటు రంగంలో మహిళలకు ఉద్యోగాలను తిరస్కరిస్తున్నారని చెప్పారు. అనేక హక్కులను రాజ్యాంగం కల్పించినా అవి అమలు కావడం లేదని తెలిపారు. పిల్లలకు రాజ్యాంగ విలువలను నేర్పించాలని ఆమె కోరారు. మహిళలు సంఘాలుగా ఏర్పడితే సామూహికంగా కొన్ని హక్కులను సాధించుకోగలుగుతారన్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూడాల్సిన బాధ్యత పురుషులతో పాటు మహిళలకు కూడా సమానంగా ఉందని చట్టం చెబుతున్నదని గుర్తుచేశారు. ఈ చట్టం వివాహిత మహిళలకు కూడా వర్తిస్తుందని తెలిపారు. మహిళలు బయటికొచ్చి సమస్యల పరిష్కారం కోసం అడిగితేనే వారి అభివృద్ధితో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

ముప్పు కబళించకముందే మేల్కొందాం : మరియం ధావలే
వరద ప్రవాహం మాదిరిగా మనవాద భావజాల ప్రమాదం ముప్పేట అలుముకుంటున్నదని మరియం ధావలే హెచ్చరించారు. ఆ భావజాలం మన ఇండ్లను వరద ప్రవాహం మాదిరిగా కబళించకముందే మేల్కొందామని ఆమె పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలు కాకుండా మనువాద బీజేపీ పాలకులు అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. దేశమంతా బాగుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతా బాగుంటే 20 శాతం మంది పిల్లలు స్కూల్ కు ఎందుకు వెళ్లడం లేదు?, 2080 శాతం మంది మహిళలు రక్తహీనతతో ఎందుకు బాధపడుతున్నారు? దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలను ఎందుకు మూసేశారు?, ప్రభుత్వ విద్యాలయాల్లో కనీస సౌకర్యాలు ఎందుకు లేవు?….అంటూ మరియం ప్రశ్నల వర్షం కురిపించారు. నూతన జాతీయ విద్యా విధానం – 2020 తో తిరోగమన విధానాలను తెచ్చి కార్పొరేట్, కాషాయీకరణ వైపు మళ్లిస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మహిళల ప్రస్తావన లేని మోడీ ప్రసంగంపై విచారం వ్యక్తం చేశారు. మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లుతో లింక్ పెట్టి అన్యాయం చేశారని విమర్శించారు. జనగణన చేయకుండా బీజేపీ బలపడేలా డీలిమిటేషన్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకిక దేశంలోని విద్యాలయాల్లో హిందూ బ్రాహ్మణిటికల్ మంత్రాలను ఎందుకు చదివించాలని ఆమె ప్రశ్నించారు.

వేతనాలు లేకుండా దేశవ్యాప్తంగా మహిళలు ఇండ్లల్లో ఏడాదికి రూ.22 లక్షల కోట్ల విలువైన పనిని చేస్తున్నారనీ, ఇది దేశ జీడీపీలో 7 శాతమని ఆమె తెలిపారు. బీజేపీ నాయకులు మహిళలపై లైంగిక వేధింపులు, దాడులను బహిరంగంగా సమర్థిస్తూ, ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. బీజేపీ పాలన నష్టం మనవరకు రాలేదనీ ఊరుకోవడానికి వీల్లేదనీ, ఆ మనువాద భావజాలం మనకు నష్టం చేయకముందే మహిళలు, యువత కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఎస్టీఎఫ్ఐ కార్యదర్శి ఎన్. అరుణకుమారి మాట్లాడుతూ మహిళలను కట్టుబాట్ల పేరుతో నియంత్రించడం వారి అభ్యున్నతికి తీవ్ర ఆటంకం కలిగించిందని తెలిపారు. అటువంటి కట్టుబాట్ల పై మహిళా ఉపాధ్యాయులు ఒక శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని ఆమె సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పురోగమించాలని కోరారు. మహిళా ఉపాధ్యాయులు పని చేసే చోట్ల, బాలికల విద్యాలయాల్లో మౌలిక వసతులు మెరుగు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి వ్యక్తిగత హక్కులను గౌరవించాలని కోరారు. మహిళా ఉపాధ్యాయులు వారి హక్కులను సాధించుకోవడానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఎస్టీఎఫ్ఐ జాతీయ నాయకులు మోతుకూరి సంయుక్త మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయుల భాగస్వామ్యం చాలా పెరగాలని ఆకాంక్షించారు. మహిళలు లేని ఏ ఉద్యమం కూడా విజయవంతం కాలేదన్న విషయాన్ని గమనించాలని సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యూటీఎఫ్ గా, తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాల ఫలితంగా అప్రెంటీస్ విధానం రద్దు అయిందని తెలిపారు. రీగ్రూపింగ్ స్కేళ్లు అమలుతో మెరుగైన వేతనాలు పొందుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మహిళా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సును సీనియర్ నాయకురాలు సి.కమల కుమారి ప్రారంభించారు. ఎస్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, రాష్ట్ర కార్యదర్శులు వి. శాంతకుమారి, వై.జ్ఞాన మంజరి, విశాలి, కె.రవి కుమార్, ఎస్. రవి ప్రసాద్ గౌడ్, వెంకటప్ప, సింహాచలం, మహిళా విభాగం కన్వీనర్ ఆర్. శారద, సీనియర్ నాయకులు జి.నాగమణి, అరుణమ్మ, అన్ని జిల్లాలల నుంచి పెద్దఎత్తున మహిళా ఉపాధ్యాయులు సదస్సులో పాల్గొన్నారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -