Monday, August 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాగునీళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలి?

సాగునీళ్లు ఎప్పుడిస్తారో చెప్పాలి?

- Advertisement -

శివన్నగూడెం ప్రాజెక్ట్ ను ఎప్పటికల్లా పూర్తి చేస్తారో తెలపాలి
పనులు చేపట్టి దశాబ్దం గడిచినా పురోగతి లేదు
రాచకొండ ఎత్తిపోతలకు నిధులు మంజూరు చేయాలి
పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం చలో హైదరాబాద్
ఈనెల 29, 30వ తేదీల్లో భువనగిరి నుంచి పాదయాత్ర
31న ఇందిరా పార్క్(ధర్నాచౌక్‌) ఎదుట మహా ధర్నా : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు 
ఎం‌డీ జహంగీర్
నవతెలంగాణ – సంస్థాన్‌‌నారాయణపురం

మునుగోడు నియోజకవర్గం ప్రజలకు సాగునీరందిం చేందుకు నిర్మిస్తున్న శివన్నగూడెం ప్రాజెక్టును ఎప్పటికల్లా పూర్తి చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం చర్లగూడెం వద్ద నిర్మిస్తున్న శివన్నగూడెం ప్రాజెక్టు పనులను సీపీఐ(ఎం) నాయకుల బృందంతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరువు పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగు నీరందించేందుకు ప్రారంభించిన డిండి ఎత్తిపోతల పథకంతోపాటు అనుసంధాన ప్రాజెక్టులన్నీ ఏండ్లు గడుస్తున్నా పూర్తి చేయడంలో గత, ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. డిండి ఎత్తిపోతల పథకానికి నీళ్లుతెచ్చే సొరంగం పనులు పూర్తి కాలేదన్నారు. ఈ పథకానికి నీళ్లు ఎక్కడి నుంచి తేవాలో తెలియక గత ప్రభుత్వం కాలం వృథా చేసిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం ఎదుల్ల రిజర్వాయర్ నుంచి నీళ్ళు తెస్తామని చెప్పినప్పటికీ నీటి పంపిణీ విషయంలో మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు.. స్థానిక ప్రాజెక్టుకు 337 లెవెల్ నుండి, డిండికి 345 లెవెల్ నుండి ఇవ్వాలని అడ్డుపడుతున్నారని తెలిపారు. ఇది ప్రాంతీయ వివక్ష కాదా అని ప్రశ్నించారు. శివన్నగూడెం, తదితర ప్రాజెక్టులకు నీళ్లు తేవాల్సిన కాల్వలకు భూ సేకరణ, కాంపోజిషన్ వంటివి జరగలేదన్నారు. వెంటనే ఈప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. శివవన్నగూడెం ప్రాజెక్ట్‌‌తోపాటు రాచకొండ లిప్ట్‌ ఇరిగేషన్ పూర్తి చేసి నారాయణపూరం, చౌటుప్పల్ మండలం రైతాంగానికి సాగు, తాగునీరు అందించాల‌ని కోరారు. శివన్నగూడెం ప్రాజెక్ట్ పనులకు 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయగా.. 11 ఏండ్లయినా నేటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్‌‌లో ఉన్న ప్రాజెక్టులను, కాలువలను, నల్లగొండ జిల్లాలో ఉన్న శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేయాలని, నిధులు విడుదల చేయాలని కోరుతూ ఈనెల 29,30 భువనగిరిలోని అంబేద్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్‌‌లోని ఇందిరాపార్క్ (ధర్నా చౌక్‌) వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్టు తెలిపారు. 31న వేలాది మందితో మహాధ‌ర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ ధర్నాలో రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుంటోజు శ్రీనివాస చారి, బూరుగు కృష్ణారెడ్డి, జల్లెల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, మండల నాయకులు రాచకొండ కృష్ణ, కొమ్ము మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -