వ్యూహ, ప్రతి వ్యూహాల్లో అధికార, విపక్షాలు
రేపటినుంచి అసెంబ్లీ సమావేశాలు
సర్కారుపై దాడికి ప్రతిపక్షాలు సమాయత్తం
హామీల అమలుపై ప్రశ్నించేలా కార్యాచరణ
సమర్థంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ సిద్ధం
వెయ్యి రోజుల ప్రగతిని వివరించేందుకు ప్లాన్
22ఏ భూముల నిషేధంతో ప్రజల్లో గందరగోళం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై అధికార, విపక్ష పార్టీలు దృష్టిసారించాయి. ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలుపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ప్రతిపక్షాల ప్రశ్నలను, దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ రెడీ అవుతున్నది. వెయ్యి రోజుల ప్రజా పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు అధికార కాంగ్రెస్ సిద్ధమవుతున్నది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు విపక్షాలు, ప్రజలకు అందిస్తున్న ప్రగతి ఫలాల గురించి చెప్పేందుకు కాంగ్రెస్ వ్యూహ, ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐలు అసెంబ్లీలో ఢీ అంటే ఢీ అన్నట్టుగానే వ్యవహరించే అవకాశమున్నది.
అభివృధ్ధిపైనే కాంగ్రెస్ ఫోకస్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్, రైతుభరోసా కింద ఏటా రూ.12 వేలు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.పది లక్షలకు పెంచి అమలు చేస్తున్నది. ఆసరా పెన్షన్ల పెంపు, మహిళలకు నెలకు రూ.2,500, కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు, రైతు కూలీలు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు, విద్యార్థులకు రూ.ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డు, ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేలు వంటివి ఇంకా అమల్లోకి రాలేదు. నిధుల కొరత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నది. అప్పులు, వడ్డీ చెల్లింపుల సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. అయినా అభివృద్ధిపైనే దృష్టిసారించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. ఇటీవల ముసారాంబాగ్, చంచల్‌గూడ ఫ్లైఓవర్లను ప్రారంభించారు. సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించారు. నకిరేకల్‌లో రూ.32 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆస్పత్రిని రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అదే నియోజకవర్గంలో రూ.9.85 కోట్ల వ్యయంతో నిర్మించే తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించే “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్”కు శంకుస్థాపన చేశారు. వీటితోపాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంతోపాటు శంకుస్థాపనలు చేశారు. 32 నెలల్లో రూ.36 వేల కోట్ల రైతు భరోసా వేశామనీ, అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం ప్రకటించారు. రెండేండ్లలో 72 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.
తెరపైకి కేసీఆర్ రాజీనామా
గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలనే అంశాన్ని రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనుంది. 365 రోజులు ఉద్యోగానికి రాకపోతే ఉద్యోగస్తులను బర్తరఫ్ చేస్తారనీ, రూ.22.24 కోట్లు ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్న కేసీఆర్ ఒక్క రోజు కూడా బయటకు రాలేదనీ, డిస్మిస్ చేయాలా వద్దా?అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంకోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అంశం ఎథిక్స్ కమిటీ పరిశీలనలో ఉన్నది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వేటు వేసే అవకాశమున్నట్టు తెలిసింది. ఒకవైపు కేసీఆర్ రాజీనామా, ఇంకోవైపు కౌశిక్‌రెడ్డిపై వేటు వేస్తే బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టొచ్చని అధికార పార్టీ భావిస్తున్నది.
నిలదీసేందుకు బీఆర్‌ఎస్ సన్నద్ధం
ఆరు గ్యారంటీలతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు బీఆర్‌ఎస్ సన్నద్ధమవుతున్నది. అసెంబ్లీలో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నది. ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ఎర్రవల్లిలో జరగనుంది. అసెంబ్లీ, శాసనమండలిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇంకోవైపు 22ఏ నిషేధిత భూముల జాబితాలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ అంశాన్ని లేవనెత్తాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.13 వేల కోట్ల వరకు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 97 జీవో వల్ల పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి ప్రభుత్వం తెచ్చింది. ఈ నిర్ణయాన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశాలను కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టారు. పీఆర్సీ అమలు, పెండింగ్‌లో ఉన్న డీఏల విడుదల, సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ అమలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఈహెచ్‌ఎస్‌ను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ లచ్చిరెడ్డి నేతృత్వంలోని ఆదివారం హైదరాబాద్‌లో ఉద్యోగుల సంకల్పసభను, మారం జగదీశ్వర్ నేతృత్వంలో ఈనెల పదిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. కృష్ణా, గోదావరి జలాలను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపైనా ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ భావిస్తున్నది.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి : సీపీఐ(ఎం)
పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనివ్వాలని కోరుతోంది. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ, ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేసింది.
పాలిటెక్నిక్ కాలేజీల విలీనంపై స్పష్టతనివ్వాలి : సీపీఐ
పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్స్ విశ్వవిద్యాల యంలో విలీనానికీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నది. విద్యార్థులు, మేధావులతో చర్చించాకే ముందుకెళ్లాల ని సూచించింది. పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్ని విధాలుగా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. సాదా బైనామాలతోపాటు 22 ఏ భూముల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
ఫీజు బకాయిలపై బీజేపీ ఆందోళన
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని బీజేపీ ఆందోళన చేపట్టింది. ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తాలని నిర్ణయించింది. 22ఏ నిషేధిత భూముల అంశాన్ని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావిస్తున్నది.



