Sunday, September 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబీఆర్‌ఎస్‌ కోటలపై దండయాత్ర

బీఆర్‌ఎస్‌ కోటలపై దండయాత్ర

- Advertisement -

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్‌ జెండా పాతుతాం
కేసీఆర్‌ సభకు రా..లేదా గౌరవంగా రాజీనామా చేయి
నేను ఉన్నంతకాలం ఆ పార్టీని ఎదగనివ్వ..
వెయ్యి రోజుల ప్రగతి పాలన సభలో సీఎం రేవంత్‌రెడ్డి
నకిరేకల్‌ లో భారీ బహిరంగ సభ

నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
‘ప్రతిపక్షనేత కే చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ‌శాసనసభకు రా… లేకుంటే గౌరవంగా పదవికి రాజీనామా చేయి…గజ్వేల్‌‌లో తేల్చుకుందాం’ అని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి సవాలు విసిరారు. ‘‘మీరు రాయి విసిరితే.. మేము ఆ రాయితోనే సమాధానం చెబుతాం… మీ సంస్కారం ఏంటో నా సంస్కారం ఏంటో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌‌రావు కలిసి అసెంబ్లీకి రావాలి. అక్కడే చూసుకుందాం. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్య, సంక్షేమం సహా అన్ని అంశాలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు సిద్ధం’’ అని తేల్చిచెప్పారు. రాష్ర్టంలో కాంగ్రెస్‌‌పార్టీ ​వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ‌నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పట్టణంలో రూ.32 కోట్లతో నిర్మించిన వంద పడకల ఏరియా ఆస్పత్రిని శనివారం సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రారంభించారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలపై ఘాటైన విమర్శలతో రాజకీయాలను వేడి పుట్టించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ర్టాన్ని తొమ్మిదిన్నరేండ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముంచి గద్దెదిగిపోయిందని విమర్శించారు. ‘​బీఆర్‌ఎస్‌ కోటలపై కాంగ్రెస్‌ దండయాత్ర చేస్తుంది. ​సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్‌ జెండా పాతుతాం’ అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో సిరిసిల్లకు వెళ్లి మూడు రంగుల జెండా ఎగురవేస్తానని, ఆ తర్వాత సిద్దిపేటపై దండయాత్ర చేస్తానని ప్రకటించారు. ​

బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే విమర్శలకు ఇకపై వెనక్కి తగ్గేది లేదని ష్టంచేశారు. బీఆర్‌ఎస్‌ ‌నేతలు రాష్ట్రాన్ని బందిపోట్లులా దోచుకున్నారని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు మోసపోయారని గుర్తుచేశారు. చివరి విడత రైతు భరోసా నిధులు వేయకుండానే గద్దె దిగిపోయారని చెప్పారు. సంపాదన పోయిందని బావ, బామ్మర్ది ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘నాకు చదువు లేదని బీఆర్‌ఎస్‌ ‌నేతలు అంటున్నారు, నాకు చదువు లేకపోయినా సంస్కారం ఉంది, అందుకే మీరు రోడ్లపై తిరుగుతున్నారు. నాకు సంస్కారం ఉంది కాబట్టే కొండా సురేఖ, సీతక్కతో రాఖీ కట్టించుకున్నాను’ అని తెలిపారు. ఎక్కడ ఆస్తి రాసి ఇవ్వాల్సి వస్తుందోనని చెల్లెని బయటకు గెంటేశారని వ్యాఖ్యానించారు. నాలుగు ఇంగ్లీషు ముక్కలు వస్తే సరిపోదని, ఆడబిడ్డను చూసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌‌కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీది అంతా చీకటిమయం అని అన్నారు. రేవంత్‌ ఉన్నంతకాలం బీఆర్‌ఎస్‌ అనే మొక్కనే ఎదగనివ్వనని అన్నారు. తెలంగాణ తులసివనంలో గంజాయి మొక్కను పీకుతామన్నారు. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 90 స్థానాలు గెలిచి తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 117 స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

​రైతు.. మహిళ.. యువతపై ఫోకస్‌
రైతు రుణమాఫీ, రైతుభరోసా, ధాన్యం కొనుగోళ్లు, సన్నవడ్ల బోనస్‌, ఉచిత విద్యుత్‌ ద్వారా రైతులకు రూ.1.70 లక్షల కోట్ల మేర ప్రయోజనం కల్పించామని సీఎం తెలిపారు. తొలి ఏడాదిలో 25.35 లక్షల మంది రైతులకు రూ.18,617 కోట్ల రుణమాఫీ చేశామని, రైతుభరోసా కింద రూ.36 వేల కోట్లు, ధాన్యం కొనుగోళ్లకు రూ.90 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు.మహాలక్ష్మి, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి పథకాలను ప్రస్తావించిన సీఎం.. మహిళా సంఘాలకు రూ.60 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని తెలిపారు. ​కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. గత బీఆర్ఎస్‌ పాలనలో ప్రశ్నపత్రాల లీకేజీలు, నియామకాల జాప్యంతో నిరుద్యోగ యువత నష్టపోయిందని విమర్శించారు.

​​‘పేదలకే పదవులు’
తమ ప్రభుత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్‌రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు చెందిన మహేష్‌కుమార్‌ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా, పలువురిని ఎమ్మెల్సీలుగా నియమించామని అన్నారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో కుటుంబ సభ్యులు, బంధువులకే పదవులు దక్కాయని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.

​రూ.344.92 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
​ప్రగతి పాలన సభకు ముందు నకిరేకల్‌ పట్టణంలో సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేశారు. మొత్తంగా రూ.344.92 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా రూ.32 కోట్లతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని ప్రారంభించారు. రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల, రూ.20 కోట్ల సమీకృత మండల కార్యాలయాల సముదాయం, రూ.9.85 కోట్ల తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌, రహదారులు, విద్యుత్‌ సబ్‌స్టేషన్లు, మున్సిపల్‌ కార్యాలయ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

​​​వేముల వీరేశంపై సీఎం ప్రశంసలు
సభకు భారీగా జనసమీకరణ చేసి విజయవంతం చేసిన నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నకిరేకల్‌ సభ సాధారణ సమావేశం కాదని, కాంగ్రెస్‌ పార్టీకి భారీ బలప్రదర్శనగా నిలిచిందన్నారు. 2029లోనూ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని నకిరేకల్‌ గడ్డ నుంచి తెలంగాణకు చాటి చెప్పేలా సభ నిర్వహించారని ప్రశంసించారు ​ప్రగతి పాలన సభలో పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్‌ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, , ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కుందూరు రఘువీర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేలు, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కుందూరు జయవీర్‌రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్‌, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్‌నాయక్‌ తదితరులు హాజరయ్యారు. ఏరియా ఆసుపత్రి ప్రారంభం దగ్గరజిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, పూలమాలలు ఇచ్చి స్వాగతం పలికారు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -