నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సంక్షోభం నెలకొంది. ఓటీటీ స్ట్రీమింగ్ నిబంధనలపై థియేటర్ యాజమాన్యాలతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో, 2026 సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదలను నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ వివాదానికి ప్రధాన కారణం.. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ చేసే కాలపరిమితి. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రావాలని థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలు త్వరగా ఓటీటీలో అందుబాటులోకి రావడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతోందని, తద్వారా తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, నిర్మాతలు మాత్రం తమ వాణిజ్యపరమైన వెసులుబాటును కోరుకుంటున్నారు.
ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు కొత్త సినిమాలను విడుదల చేయకూడదని నిర్మాతల మండలి స్పష్టం చేసింది. అయితే, ఇది పూర్తిస్థాయి బంద్ కాదని, సినిమా షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, తమిళనాడు థియేటర్ యజమానుల సంఘం ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం సెప్టెంబర్ నెలతో పాటు ఆ తర్వాత విడుదల కావాల్సిన పలు చిత్రాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.



