– అప్రిసియేషన్ పొందిన వారం రోజుల్లోనే వివరణ కోరుతూ నోటీసు
నవతెలంగాణ-రాయికల్: విధుల నిర్వహణలో ప్రతిభ కనబరిచినందుకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారుల నుంచి అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందుకున్న రాయికల్ తహసీల్దార్ ఎస్.నాగార్జునకు వారం రోజులు తిరగకముందే వివరణ కోరుతూ కలెక్టర్ కార్యాలయం మెమో జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఆగస్టు 15న నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తహసీల్దార్ నాగార్జునకు జిల్లా ఉన్నతాధికారుల చేతుల మీదుగా అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందింది.విధుల పట్ల చూపిన పనితీరుకు గుర్తింపుగా ఈ ప్రశంసా పత్రం అందుకున్న ఆయనకు ఆరు రోజులు గడవకముందే, ఆగస్టు 21న కలెక్టర్ కార్యాలయం నుంచి మెమో జారీ అయింది.
రీ-సర్వే సమస్యలపై..
రాయికల్ మండలంలోని దావన్‌పల్లి, ఉప్పుమడుగు గ్రామాల్లో రీ-సర్వే సందర్భంగా తలెత్తిన సమస్యలు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను సకాలంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో తహసీల్దార్ విఫలమయ్యారని మెమోలో పేర్కొన్నారు. సమస్యలను సకాలంలో నివేదించి పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరిపాలనకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని అధికారులు పేర్కొన్నారు.
24 గంటల్లో వివరణ…
విధుల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతల నిర్వహణలో తగిన శ్రద్ధ చూపలేదనే ఆరోపణలపై తెలంగాణ సివిల్ సర్వీసెస్ (వర్గీకరణ, నియంత్రణ, అప్పీలు) నియమాలు–1991 ప్రకారం ఎందుకు క్రమశిక్షణా చర్యలు చేపట్టకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మెమో అందిన 24 గంటల్లోపు వివరణ సమర్పించాలని, లేకుంటే అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
వారం రోజుల వ్యవధిలోనే ప్రశంసా పత్రం నుంచి వివరణ మెమో వరకు పరిణామాలు చోటుచేసుకోవడం రాయికల్ రెవెన్యూ వర్గాల్లో చర్చకు దారితీసింది.
ప్రశంసల నుంచి మెమో దాకా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


