గ్రామాల్లో సక్రమంగా సాగని ఫాగింగ్
ప్రజలకు తప్పని ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో రోడ్లు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉంటున్నాయి. దీంతో దోమల బెడద పెరుగుతోంది. వాటి నియంత్రణకు గ్రామాల్లో సక్రమంగా ఫాగింగ్ చేపట్టకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మండలంలో 15 పంచాయతీలు, ఐదు అనుబంధ గ్రామాలు ఉండగా..అన్ని జీపీలకు ఇప్పటికీ ఫాగింగ్ యంత్రాలున్నా కొన్ని జీపీల్లో పనిచేయకపోవడం గమనార్హం.
చెడిపోయిన ఫాగింగ్ యంత్రాలు
వర్షాకాలంతో పాటు దోమల బెడద ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రతీ రోజు ఫాగింగ్ చేపట్టాలి. కానీ మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉండగా చిన్నతూండ్ల, కొయ్యుర్ , వల్లెంకుంట, మల్లారం, పెద్దతూండ్ల, రుద్రారం గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్న అవి చెడిపోయి మరమ్మతులు చేపట్టని కారణంగా వృథాగా మారాయి. యంత్రాలు ఉన్న గ్రామాల్లో సైతం పలు కారణాలతో అరకొరగా ఫాగింగ్ చేపడుతున్నారు. దానికి తోడు ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లోని అంతర్గత రోడ్లు, ఇళ్ల మధ్యన ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయి. కనీసం అధికారులు ఖాళీ స్థలాల్లో పెరిగిన గడ్డిని సైతం తొలగించడం లేదు. దీంతో పగలు, రాత్రీ తేడా లేకుండా దోమలు ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. దీంతో ప్రజలు తరచూ సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు.
నిధులు లేక..
దోమల నియంత్రణకు ఫాగింగ్ చేసే యంత్రాల్లో నింపే రసాయనాల కొనుగోలు అధికారులకు బేజారుగా మారింది. పలు పంచాయతీల్లో సరైన నిధులు లేక సిబ్బందికి వేతనాలు సర్దుబాటు చేయడమే కష్టంగా మారింది. ఒక్కసారి ఫాగింగ్ చేపట్టడానికి ఇంధనం,రసాయనాలకు సుమారు రెండు, మూడు వేల వరకు ఖర్చు అవుతోంది.నిధులు లేక పలు గ్రామాల్లో నెలలో ఒకటి, రెండు సార్లు ఫాగింగ్ చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
అన్ని గ్రామాల్లో ఫాగింగ్ చేపడతాం: మల్లిఖార్జున రెడ్డి..ఇంచార్జి ఎపిఓ
మండలంలో ఫాగింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్న గ్రామాల్లో దోమల నియంత్రణకు ఫాగింగ్ చేపడుతున్నాం. ఫాగింగ్ యంత్రాలు చెడిపోయిన గ్రామాల్లో మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు నివేధించాం. ప్రజలు పరిసరాల పరిశుభ్రత పాటించాలి.



