Wednesday, August 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంప్రతీకారం తీర్చుకుంటాం

ప్రతీకారం తీర్చుకుంటాం

- Advertisement -

అమెరికా ఆంక్షలపై ఇరాన్‌
టెహ్రాన్‌ :
తనను ఆర్థికంగా ఒంటరిని చేసేందుకు అమెరికా విధించిన తాజా ఆంక్షలపై ఇరాన్‌ మండిపడింది. ప్రతీకారం తీర్చుకుంటానని ప్రకటించింది. అమెరికా ఒత్తిడులకు తన వాణిజ్య భాగస్వాములు లంగబోరని, వాటిని ప్రతిఘటిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెస్సెంట్‌ సోమవారం ఇరాన్‌పై తాజాగా మరిన్ని ఆర్థిక పరమైన ఆంక్షలను విధించారు. ఇరాన్‌తో వ్యాపారం చేస్తున్న దేశాలపై కూడా ఆంక్షలు తప్పవని బెదిరించారు. అయితే ఏయే దేశాలపై ఆంక్షలు విధించేదీ, అవి ఎప్పటి నుంచి అమలులోకి వచ్చేదీ ఆయన వెల్లడించలేదు. కాగా ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలలో కొన్నింటిని ఆ తర్వాత నిలిపివేశారు.
అంతకుముందు అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ మొత్తం 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై కొత్త ఆంక్షలను ప్రకటించింది. అయితే చైనా ఆర్థిక సంస్థలేవీ ఈ ఆంక్షల జాబితాలో లేవు. ఇరాన్‌తో అంతర్జాతీయ చట్టాల పరిధిలోనే సహకారాన్ని కొనసాగిస్తున్నామని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని, అలాగే దానికి ఆటంకం కలిగించకూడదని చైనా మంగళవారం స్పష్టం చేసింది. అమెరికా ఆర్థిక ఆంక్షలకు ప్రతీకారంగా సైనిక చర్యకు పాల్పడడం లేదా గల్ఫ్‌ నుంచి చమురు ఎగుమతులను మరింతగా అడ్డుకోవడం వంటి చర్యలకు దిగుతామని ఇరాన్‌ హెచ్చరించింది. అమెరికా ఆంక్షలకు తాము సిద్ధంగానే ఉన్నామని ఇరాన్‌ ఆర్థిక మంత్రి అలీ మదనీజాదె తెలిపారు. ‘మా రక్షణ విధానం కేవలం రక్షణాత్మకంగానే ఉండదు. మా దాడులను ఎదుర్కోవడానికి శత్రువులు సిద్ధంగా ఉండాలి’ అని ఆయన ప్రభుత్వ టీవీతో అన్నారు. అమెరికా చర్యలను చైనా, రష్యా అంగీకరించడం లేదని చెప్పారు. ఇతర దేశాలు కూడా వాటిని వ్యతిరేకిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా ఇరాన్‌ మౌలిక సదుపాయాలకు ముప్పు వాటిల్లితే అమెరికా కీలక ప్రయోజనాలు, ఇంధన సరఫరా మార్గాలపై తీవ్రమైన దాడులు చేస్తామని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ హుస్సేన్‌ మొహబ్బీ హెచ్చరించారు.

ట్రంప్‌ వీడియోపై మండిపాటు
ఓటమిని, ఆకలిని టెహ్రాన్‌ అంగీకరించిందంటూ మార్ఫింగ్‌ చేసిన ఓ వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విడుదల చేసిన నేపథ్యంలో ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఖర్‌ ఖలీబఫ్‌ ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్రంప్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమెరికాలో ఆహార భద్రత కరువైందని ఎత్తిచూపారు. ‘అమెరికాను మరోసారి ఆకలితో అలమటించేలా చేయండి’ అంటూ వైరల్‌ అయిన నినాదాన్ని ప్రస్తావించారు. అమెరికాలో 47 మిలియన్ల మంది ఆకలితో అల్లాడిపోతున్నారని తెలిపారు. ఇతర దేశాలతో ఇరాన్‌కు ఉన్న ఆర్థిక సంబంధాలను అమెరికా దెబ్బతీయలేదని చెప్పారు. అమెరికా వాగాడంబరతను ఎవరూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -