Monday, August 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా వీసా ఫీజుల పెంపు

అమెరికా వీసా ఫీజుల పెంపు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా వీసా ఫీజులను భారీగా పెంచే ప్రతిపాదన భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హెచ్-1బీ వర్క్ వీసాలతో పాటు ఎఫ్-1 ఓపీటీ (అప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ప్రోగ్రామ్‌పై కొత్త ఫీజులు విధించే ప్రతిపాదనను ఈ నెలలో ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్‌కు సమర్పించినట్లు న్యూయార్క్‌కు చెందిన న్యాయ సంస్థ ఫ్రాగోమాన్ తెలిపింది. కొత్త ఫీజు లక్ష డాలర్ల వరకు ఉండొచ్చని వార్తలు వస్తున్నాయి. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.83 లక్షలు. గతంలో ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ పిటిషన్లపై లక్ష డాలర్ల అదనపు ఫీజు విధించేందుకు ప్రయత్నించింది. అయితే ఈ నిర్ణయంపై న్యాయపరమైన సవాళ్లు ఎదురవడంతో దాని అమలుపై అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అదే తరహా భారాన్ని కొత్త పన్ను రూపంలో విధించే ప్రయత్నం జరుగుతున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం హెచ్-1బీకి సాధారణ పిటిషన్ ఫీజుతో పాటు శిక్షణ, మోసాల నివారణ వంటి వివిధ రుసుములు ఉంటాయి. వీటిలో ఎక్కువ భాగాన్ని ఉద్యోగం కల్పించే కంపెనీలే భరిస్తాయి. అయితే ఎఫ్-1 వీసాపై అమెరికాలో చదువుకున్న తర్వాత ఓపీటీ ద్వారా పని అనుమతి పొందే విద్యార్థులు కొన్ని రుసుములను వ్యక్తిగతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఓపీటీకి సంబంధించిన ఫీజులు సుమారు రూ.39 వేల నుంచి రూ.43,200 వరకు ఉండేవి.

అమెరికాలో హెచ్-1బీ వీసాలు పొందుతున్న వారిలో భారతీయుల వాటా 71 శాతంగా ఉంది. హెచ్-1బీకి సంబంధించిన భారీ రుసుములను కంపెనీలు భరించే అవకాశం ఉన్నప్పటికీ, ఓపీటీ ఫీజుల్లో భారీ పెరుగుదల నేరుగా విద్యార్థులపై ఆర్థిక భారాన్ని మోపనుంది. దీంతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థులకు ఈ ప్రతిపాదన పెద్ద ఆందోళనగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -