Friday, August 28, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌కు మరో జలగండం..

నేపాల్‌కు మరో జలగండం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఇటీవలి భారీ వరదలతో అతలాకుతలమైన నేపాల్‌ను మరో ముప్పు ఆందోళనకు గురిచేస్తోంది. నేపాల్-టిబెట్ సరిహద్దులోని భోటే కోశి నది జన్మస్థానం వద్ద నూతనంగా ఒక భారీ సరస్సు ఏర్పడిందని, దీనివల్ల రాబోయే రెండు మూడు రోజుల్లో తీవ్రస్థాయిలో వరదలు సంభవించే ప్రమాదం ఉందని చైనా అధికారులు హెచ్చరించారు. ఈ సమాచారంతో నేపాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది.

టిబెట్‌లో జన్మించే చోచెన్ ఖోలా, పురేపు సంగ్పో నదుల సంగమ ప్రాంతంలో ఈ కొత్త సరస్సు ఆవిర్భవించింది. నిన్నటి ఉదయం సమయానికే ఇందులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరిందని, రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని చైనా వెల్లడించింది. దీనివల్ల సరస్సు కట్ట తెగిపోయి దిగువ ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని చైనా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ సమాచారాన్ని చైనా ప్రభుత్వం నేపాల్ విదేశాంగ శాఖకు అధికారికంగా తెలియజేసింది. దీంతో నేపాల్ జల, వాతావరణ శాఖ అప్రమత్తమైంది. భోటే కోశి, త్రిశూలి నదులకు మళ్లీ వరద ముప్పు పొంచి ఉన్నందున, ప్రజలు నదీ తీరాలకు దూరంగా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సహాయక బృందాలు, ప్రయాణికులు, భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల సంభవించిన వరదల కారణంగా నేపాల్‌లో మృతుల సంఖ్య 359కి చేరినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. ఒక్క చిత్వాన్ జిల్లాలోనే ఇప్పటివరకు 132 మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -