– జాతీయ స్థాయికి ఎంపికైన ఆసుపాక క్రీడాకారులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సన్మానం
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించాలనే లక్ష్యంతో నిర్వహించిన 18 వ ఈషా గ్రామోత్సవం, గ్రామీణ క్రీడా ప్రోత్సాహ వేదిక ఆధ్వర్యంలోని రూరల్ ప్రీమియర్ లీగ్ – 2026లో అశ్వారావుపేట నియోజకవర్గ క్రీడాకారులు సత్తా చాటారు. రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి చెందిన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. దీంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే స్వగ్రామం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ జాతీయ స్థాయికి ఎంపికైన ఆసుపాక గ్రామ క్రీడాకారులను అభినందించి ఘనంగా సన్మానించారు. రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం, అవకాశాలు లభిస్తే రాష్ట్ర, జాతీయస్థాయిలో మరింత ఉన్నత స్థాయికి ఎదగగలరని ఎమ్మెల్యే అన్నారు. క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లోనూ అశ్వారావుపేట నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
గ్రామీణ యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఆసుపాక క్రీడాకారులు సాధించిన విజయం నియోజకవర్గంలోని ఇతర గ్రామాల యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. యువత చెడు వ్యసనాలకు, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.



