Thursday, April 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆదివాసీ, గిరిజనుల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ఆదివాసీ, గిరిజనుల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

- Advertisement -

– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. వాటి అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారంపైన ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులపైన మంత్రి సీతక్క నేతృత్వంలో గిరిజన, ఆదివాసీ ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ ఆయన నివాసంలో కలిసి పలు సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్‌ డ్యాంల నిర్మాణంపైన దృష్టి సారిస్తామని వారికి సీఎం హామీ ఇచ్చారు. వాటి ద్వారా తాగు, సాగు నీటి అవసరాలను తీర్చవచ్చునని ఆయన అన్నారు. చెక్‌ డ్యాంలు, రహదారుల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చేలా చూస్తానన్నారు. ఆదివాసీ, గిరిజన రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అటవీశాఖ అభ్యంతరాల వల్ల రహదారుల మరమ్మత్తులు ఆలస్యం అవుతాయనీ, కొన్ని చోట్ల కొత్త రహదారులకు అనుమతులు ఇవ్వడం లేదని వారు సీఎం దృష్టికి తెచ్చారు. వీలైనంత త్వరగా వాటిపైన నిర్ణయం తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల కోటా పెంచే విషయాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేస్తామనీ, ఆదివాసీ, గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -