Wednesday, April 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపశ్చిమాసియా యుద్ధం..భారత్‌లో 25 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి

పశ్చిమాసియా యుద్ధం..భారత్‌లో 25 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, సైనిక ఉద్రిక్తతల కారణంగా భారత్‌లోని 25 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. దేశంలో మానవ అభివృద్ధి పురోగతిలో కొంత నష్టాన్ని చవిచూడవచ్చని అంచనా వేసింది. ‘పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తత – ఆసియా, పసిఫిక్ అంతటా మానవాభివృద్ధి ప్రభావాలు’ అనే టైటిల్ తో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్ డిపి) మంగళవారం ప్రాథమిక అంచనా నివేదికను విడుదల చేసింది. ఈ సంఘర్షణలు ఆసియా, పసిఫిక్ అంతటా మానవపురోగతిపై ఒత్తిళ్లను తీవ్రతరం చేస్తోందని అంచనా వేసింది.

యుద్ధ సంక్షోభంతో పెరిగిన ఇంధనం, రవాణా, ముడిసరుకుల వ్యయం కుటుంబాల కొనుగోలు శక్తిని తగ్గిస్తోంది, ఆహార అభద్రతను పెంచుతోంది, ప్రభుత్వ బడ్జెట్లపై భారం మోపుతోంది, జీవనోపాధిని బలహీనపరుస్తోంది. ప్రాథమిక అంచనా ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా 88 లక్షల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోయే ప్రమాదంలో ఉన్నారని, పశ్చిమాసి సైనిక ఉద్రిక్తత కారణంగా ఆసియా -పసిఫిక్ కు 299 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లవచ్చని పేర్కొంది.

భారతదేశంలో పేదరికం సుమారు 4,00,000 నుండి 25లక్షలకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ సంఘర్షణ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా పేదరికంలోకి వెళ్లే వారి సంఖ్య వివిధ పరిస్థితులలో సుమారు 19 లక్షల నుండి సుమారు 88 లక్షలకు పెరుగుతుందని, దీనిలో దక్షిణాసియా వాటా అత్యధికంగా ఉంటుందని, ఇది సుమారు 17 లక్షల నుండి 80 లక్షలకు పైగా ఉంటుందని నివేదిక తెలిపింది. దక్షిణాసియాలో జనాభా పరిమాణం, ఆదాయ, వ్యయాల హెచ్చుతగ్గులకు ఎక్కువగా గురికావడాన్ని ఇది ప్రతిబింబిస్తుందని వెల్లడించింది. అయితే చైనాలో ఈ ప్రభావం మితంగా ఉంటుందని, పేదరికంలోకి నెట్టివేయబడే వారి సంఖ్య సుమారు 1,15,000 నుండి 6,20,000 వరకు ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది.

సైనిక సంఘర్షణ (28 రోజులే అయినప్పటికీ, 8 నెలల సర్దుబాటుతో కూడిన అత్యంత తీవ్రమైన పరిస్థితి ) కారణంగా పేదరికంపై పడే ప్రభావాన్ని నివేదిక హైలెట్ చేసింది. భారతదేశంలో పేదరికం రేటు 23.9శాతం నుండి 24.2శాతానికి పెరుగుతుందని, దీంతో 24,64,698మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడతారని నివేదిక అంచనా వేసింది. సంక్షోభానికి ముందు 35.15లక్షల మంది పేదరికంలో ఉండగా, సంక్షోభానంతరం ఈ సంఖ్య 35.40 లక్షలకు చేరుతుందని అంచనా వేసింది. ఈ ప్రాంతంలోని దేశాల మానవ అభివృద్ధి సూచిక (హెచ్ డిఐ)పై యుద్ధ ప్రభావాన్ని యుఎన్ డిపి అంచనా వేసింది. ఇరాన్ హెచ్ డిఐ సుమారుగా ఒకటి నుండి ఒకటిన్నర సంవత్సరాల మానవాభివృద్ధి పురోగతికి సమానమైన మొత్తంలో క్షీణత ఉండవచ్చని సూచించింది.

భారతదేశంలో హెచ్ డిఐ పురోగతిలో సుమారు 0.03శాతం నుండి 0.12 సంవత్సరాల నష్టాన్ని ఎదురవవచ్చని అంచనా వేసింది. తర్వాత నేపాల్ సుమారు 0.02శాతం నుండి 0.09 సంవత్సరాలు, వియత్నాం 0.02శాతం నుండి 0.07 నష్టాన్ని ఎదుర్కోవచ్చని అంచనా వేసింది. చైనాలో పరిమితంగా సుమారుగా 0.01-0.05 సంవత్సరాల పరిధిలో ఉంటుందని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -