Wednesday, April 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌లో ఉద్రిక్తత

హార్ముజ్‌లో ఉద్రిక్తత

- Advertisement -

జలసంధికి చేరువగా యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ, యుద్ధ నౌకలు
టెహ్రాన్‌ :
ఇరాన్‌తో సంబంధమున్న నౌకల ప్రయాణాన్ని అడ్డుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాలు అమలులోకి రావడంతో హార్ముజ్‌ జలసంధిలో ఉద్రిక్తత నెలకొంది. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక కదలికలు పెరిగాయి. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ సోమవారం రాత్రి చడీచప్పుడు కాకుండా అరేబియా సముద్రం మీదుగా హార్ముజ్‌ జలసంధి సమీపంలో మోహరించింది.
ఈ నౌకలో ఎఫ్‌-35బీ యుద్ధ విమానాలు, ఎంవీ-22 సైనిక రవాణా-కార్గో విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయి. అంతేకాదు…ఇది ఇరవైకి పైగా ఎఫ్‌-35బీ యుద్ధ విమానాలకు మద్దతు ఇస్తుంది. ఇరాన్‌ నౌకలను అడ్డుకోవాలంటూ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేసిన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సెంట్‌కామ్‌) రంగంలోకి దిగింది. ఇరాన్‌ ఓడరేవులు, తీర ప్రాంతాలకు రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకుంటోంది. అరేబియన్‌ గల్ఫ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో కూడా ఇదే పరిస్థితి కన్పిస్తోంది.

అమెరికా సన్నాహాలు
హార్ముజ్‌ జలసంధి పరిసరాలలోని వ్యూహాత్మక ప్రదేశాల వద్ద అమెరికా పదిహేను యుద్ధ నౌకలను మోహరించింది. ఇరాన్‌ తీర ప్రాంతంలో నౌకలను మోహరిస్తే దాడులు జరగవచ్చునన్న అనుమానంతో అమెరికా దళాలు వ్యూహాత్మక ప్రదేశాలను ఎంచుకున్నాయి. జలసంధికి రెండు వైపులా నౌకలను అడ్డుకునే విషయంపై అమెరికా నౌకాదళం దృష్టి సారించింది. జలసంధి మూసివేతను ఉల్లంఘించే ఓడలను అమెరికా యుద్ధ నౌకలు ఆపి తనిఖీ చేస్తున్నాయి. సహకరించేందుకు నిరాకరిస్తే ప్రత్యేక సైనిక సిబ్బంది, సుశిక్షితులైన నౌకాదళ సిబ్బంది రంగంలోకి దిగుతారు. ఈ ఆపరేషన్స్‌కు యుద్ధ విమాన వాహక నౌకలో ఉన్న హెలికాప్టర్లు మద్దతు ఇస్తాయి. అమెరికా దళాలు తమ విస్తృత నిఘా వ్యవస్థల పైన, ఇతర సమాచారాల పైన కూడా ఆధారపడతాయి. చమురు నౌకల కదలికలను అవి ఎప్పటికప్పుడు పసిగడతాయి. అవసరమైతే సమీపంలోని గల్ఫ్‌ దేశాలలో ఉన్న బృందాలు కూడా రంగంలోకి దిగుతాయి.

అంత తేలిక కాదు
అమెరికా నౌకాదళం ఎంత శక్తివంతమైనదైనప్పటికీ ఈ తరహా అడ్డగింపు అంత తేలిక కాదని అధికారులు, మాజీ కమాండర్లు అభిప్రాయపడ్డారు. ఈ ఆపరేషన్‌కు విస్తృత వనరులు, జాగరూకతతో కూడిన సమన్వయం, నిరంతర నిఘా అవసరమని వారు తెలిపారు. ఒకవేళ నౌకలను స్వాధీనం చేసుకుంటే వాటి నిర్వహణకు సిబ్బంది అవసరమవుతారు. ఆ నౌకలను నిలిపి ఉంచడానికి స్థలం కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పటికే క్లిష్టతరంగా ఉన్న ఆపరేషన్‌ మరింత సంక్లిష్టమవుతుంది. ఇరాన్‌తో సంబంధమున్న నౌకలు…ముఖ్యంగా ఇరాన్‌ పతాకంతో ఉన్న నౌకలు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) మద్దతు తీసుకుంటాయి. హార్ముజ్‌ ప్రాంతంలో ఐఆర్‌జీసీని మంచి పట్టుంది. అదీకాక హార్ముజ్‌ జలసంధి ఇరుకుగా ఉండడంతో ఆపరేషన్‌ అంత సులభం కాదు. దాని సమీపంలోనే ఇరాన్‌ తీర ప్రాంతాలు ఉన్నాయి. వీటి నుంచి డ్రోన్లు, వేగవంతంగా దాడులు చేసే పడవలతో విరుచుకుపడే అవకాశం ఉంది. ఇక అడుగడుగునా అమర్చిన మందుపాతరలు సరేసరి.

ఇరాన్‌ అమ్ములపొదిలో అపార ఆయుధ సంపత్తి
యుద్ధంలో ఇరాన్‌ సైనిక శక్తి కొంత బలహీనపడినప్పటికీ దాని వద్ద ఇప్పటికీ అపార ఆయుధ సంపత్తి ఉంది. వేలాది బాలిస్టిక్‌ క్షిపణులు, వేగవంతంగా దాడి చేయగల పడవలు, అసమాన వ్యూహాలు దాని అమ్ములపొదిలో ఉన్నాయి. సమీపంలోని గల్ఫ్‌ దేశాలలో ఉన్న అమెరికా మౌలిక సదుపాయాల పైన, ఓడరేవుల పైన దాడులు చేయడం ద్వారా పోరును ఉధృతం చేసే సత్తా ఇరాన్‌కు ఉంది. తమ సైనిక బలగాలకు కొదవేమీ లేదని ఐఆర్‌జీసీ తేల్చి చెప్పింది. ఘర్షణలు కొనసాగితే మరిన్ని బలగాలు రంగంలోకి దిగుతాయని హెచ్చరించింది.
ఇరాన్‌ ఇంకా తన పూర్తి స్థాయి సామర్ధ్యాన్ని ప్రదర్శించలేదని ఐఆర్‌జీసీ ప్రతినిధి హుస్సేన్‌ మొహెబ్బీ తెలిపారు. మరిన్ని అత్యాధునిక యుద్ధ పద్ధతులను అవలంబిస్తామని, వాటిని ఎదుర్కొనే సామర్ధ్యం శత్రువుకు పరిమితంగానే ఉన్నదని చెప్పారు.

జలసంధిని దాటిన నౌకలు
ట్రంప్‌ ఆదేశాలు జారీ అయిన వెంటనే హార్ముజ్‌లో నిలిచిపోయిన లేదా అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఇరాన్‌ నౌకలు జలసంధిని దాటేశాయని అల్‌ జజీరా వార్తా సంస్థ తెలిపింది.
ఆంక్షలు అమలులోకి రాగానే రెండు చమురు ట్యాంకర్లు…రిచ్‌ స్టర్రే, ఆస్రియాలు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయాయని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -