Wednesday, April 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదళితులపై కాంగ్రెస్‌ వివక్ష

దళితులపై కాంగ్రెస్‌ వివక్ష

- Advertisement -

ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిఘటిస్తాం
అంబేద్కర్‌ అందరివాడు
మహాత్మాగాంధీతో సమానం : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
తెలంగాణ భవన్‌లో ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులను మోసం చేసిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. దళితులకు ఇచ్చిన హామీలు, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌, అంబేద్కర్‌ అభయహస్తం అమలు చేయలేదని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగునా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి కేటీఆర్‌ సహా ఇతర నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలో ఆర్టికల్‌ 3 లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా నిర్వహించలేకపోతోందని చెప్పారు. వాటిలో మరణ మృదంగం మోగుతోందని అన్నారు. ఆహార కల్తీ, ఆత్మహత్యల వల్ల 130 మందికి పైగా విద్యార్థులు మరణించారని గుర్తు చేశారు. అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ రాజకీయ అవసరాలకే వాడుకుందన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ కాలంలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చినప్పుడే ఆయనకు ఆ గౌరవం దక్కిందని అన్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఆయన ఫొటో పెట్టడానికి కూడా కాంగ్రెస్‌ ఒప్పుకోలేదన్నారు. దళిత బంధు కింద కేసీఆర్‌ రూ.10 లక్షలు ఇస్తే, అంబేద్కర్‌ అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని చెప్పారు. ఆ పథకాన్ని అమలు చేయకుండా దళితులను, అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం అవమానిస్తోందని అన్నారు. నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఓవర్సీస్‌ పథకం కింద విదేశీ విద్యను అభ్యసించే విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఈనెల 27న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం, జగిత్యాలలో బహిరంగ సభ తర్వాత మే, జూన్‌లో ఎస్సీ, ఎస్టీల కోసం సభలు పెడతామని తెలిపారు. కాంగ్రెస్‌ హామీలు, వివిధ డిక్లరేషన్ల అమలు కోసం పకడ్బందీగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ కొందరివాడు కాదనీ, అందరివాడనీ, మహాత్మా గాంధీతో సమానమని అన్నారు. జై భీమ్‌, జై తెలంగాణ, జై కేసీఆర్‌ అనే నినాదంతో ముందుకు పోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వి శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -