– ఇరాన్‌పై యుద్ధానికి కలిసిరాని అమెరికా మిత్రదేశాలు
– ట్రంప్ ప్రతిపాదనకు తిరస్కరణ
– యుద్ధంలోకి ఇంధన దిగుమతిదారులు కూడా రావాలని ట్రంప్ ఆదేశాలు
– మాటవినకుంటే కష్టాలేనంటూ బెదిరింపులు
– ఇరాన్‌తో మాకున్న అనుబంధంలో జోక్యం చేసుకోవద్దు : అమెరికాకు చైనా వార్నింగ్
– శాంతికి నాలుగు సూత్రాలను ప్రతిపాదించిన చైనా అధ్యక్షుడు
– మోడీకి ఫోన్ చేసిన ట్రంప్ 40 నిముషాలు చర్చలు
నవతెలంగాణ-సెంట్రల్‌డెస్క్
ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడం, హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరాన్‌పై యుద్ధం చేసేందుకు కలిసిరావాలంటూ ఆయన మిత్రదేశాలకు పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనను అమెరికా మిత్రదేశాలు సున్నితంగా తిరస్కరించాయి. దీనితో ట్రంప్ మిత్రదేశాలపై భగ్గుమన్నారు. పరిణామాలు అనుభవించాల్సి వస్తుందంటూ బెదిరింపులకు దిగారు. యుద్ధంలోకి ఇంధన దిగుమతిదారులు కూడా కలిసిరావాలని చేసిన విజ్ఞప్తిని కూడా ఎవరూ పట్టించుకోలేదు. అదే సమయంలో ఇరాన్-చైనా దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల్లోకి చొరబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చైనా అమెరికాను గట్టిగా హెచ్చరించింది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి నెలకొల్పేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నాలుగు ప్రతిపాదనలు చేశారు. ఇరుపక్షాలు అంగీకరిస్తే తాము మధ్యవర్తిత్వం నెరపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మరోవైపు భారత్, ఫ్రాన్స్ సీనియర్ అధికారులు లండన్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, పౌర అణుఇంధనం, అంతరిక్షం, సైబర్ రంగ సహకారం, ఇతరత్రా కీలకమైన ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచవ్యాప్త అంశాలపై ఈ చర్చలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం సాయంత్రం ఫోన్ చేశారు. ఇరువురు నేతలు దాదాపు 40 నిముషాలపాటు పలు అంశాలపై చర్చిం చారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. అయితే ఏ అంశాలపై చర్చలు జరిగాయనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇరాన్‌తో యుద్ధానికి అమెరికా మిత్రదేశాల తిరస్కరణ నేపథ్యంలో భారత్‌తో ట్రంప్ టెలిఫోన్ సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది. హార్ముజ్‌ను మూసివేయడం ద్వారా మధ్యప్రాచ్య సంక్షోభంలోకి ఇతర దేశాలను కూడా లాగేందుకు ట్రంప్ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇరాన్ యుద్ధానికి ముందు ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు ఐదో వంతు హార్ముజ్ ద్వారానే జరిగింది. ప్రధాన గల్ఫ్ ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాన్‌లు ఆసియాలోని ప్రధాన ఇంధన దిగుమతిదారులైన చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాలతో ఈ జలసంధి అనుసంధానమై ఉంది. భారత ఎల్పీజీ దిగుమతుల్లో 90 శాతం వరకూ ఈ జలసంధి ద్వారానే జరుగుతున్నాయి.
చైనాకు ట్రంప్ హెచ్చరికలు
గల్ఫ్ దేశాల నుంచి వెళ్లే చమురు సరఫరాలు గణనీయంగా తగ్గాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యూఏఈలోని కొన్ని కేంద్రాలతో సహా, ప్రాంతీయ ఇంధన సంస్థలపై ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయని చెప్పుకొచ్చారు. అదే సమయంలో అమెరికా, చైనా మధ్య కూడా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయంటూ కామెంట్ చేశారు. చైనా ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు తేలితే, ఆ దేశం 50 శాతం వరకు సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఈ ఉద్రిక్త వాతావరణంలో అమెరికా నిషేధించిన, చైనాతో సంబంధం ఉన్న ‘రిచ్ స్టార్రీ’ అనే ట్యాంకర్ హార్ముజ్ జలసంధి గుండా వెళుతూ కనిపించడం మరో ఆసక్తికరమైన పరిణామమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సముద్రయాన ట్రాఫిక్ డేటా ప్రకారం ఆ నౌక మొదట తన మార్గాన్ని మార్చుకున్నప్పటికీ, చైనా సిబ్బందికి సమాచారం అందించిన తర్వాత తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించినట్టు తెలిసింది.
ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరు మాట్లాడుకున్నట్టు సమాచారం. పశ్చి మాసియాలో పరిస్థితులు, భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సహకారం, హార్మూజ్ జలసంధిని తెరవడంపై ప్రధానంగా చర్చించినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు విఫలమైన వేళ ఈ చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సందర్భంగా మోడీ ‘ఎక్స్’ ఖాతాలో ”మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాం. అన్ని రంగాల్లో సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నాం. పశ్చిమాసియాలో పరిస్థితులపైనా చర్చించాం. హర్మూజ్‌ను తెరవడం, సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని రాసుకొచ్చారు.
ఈ పరిణామాలపై భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పందించారు. ఇద్దరి నేతల మధ్య సంభాషణ సానుకూలంగా సాగిందన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలను ప్రధాని మోడీకి ట్రంప్ వివరించారని తెలిపారు.
భాగస్వాములం అవ్వం
ట్రంప్ ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ ఇరాన్ యుద్ధంలో తాము చేరబోమని, హార్ముజ్ మూసివేతలో భాగస్వాములం కాబోమని బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే హార్ముజ్ జలసంధి స్వాధీన ప్రయత్నాలలో పాల్గొంటామని జపాన్, బ్రిటన్ స్పష్టం చేశాయి. ట్రంప్‌తో చేతులు కలిపేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ కూడా ఇష్టపడలేదు.
జాయింట్ నావల్ టాస్క్‌ఫోర్స్‌కు ‘నో’
హార్ముజ్‌పై పెత్తనం చెలాయించడానికి జాయింట్ నావల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని ట్రంప్ అంతకుముందు చేసిన ప్రతిపాదనకు మిత్ర దేశాలు, ప్రధాన ఇంధన దిగుమతిదారులు ‘నో’ చెప్పాయి. దీంతో ట్రంప్ ఆగ్రహించారు. ఆయా దేశాలను శిక్షించాలన్న ఉద్దేశంతో హార్ముజ్ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. జాయింట్ నావల్ టాస్క్‌ఫోర్స్‌లో భాగస్వాములు కావడానికి ఇష్టపడని దేశాలు స్వతంత్రంగా ఇంధన కొనుగోలుకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఆ జాబితాలో చైనా, భారత్‌తో పాటు అమెరికా మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియా కూడా ఉన్నాయి. ట్రంప్ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు మరోసారి పెరిగాయి.
యుద్ధశాంతికి నాలుగు సూత్రాలు ప్రతిపాదించిన షీ జిన్‌పింగ్
అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతిని నెలకొల్పుతూ, మధ్యప్రాచ్య సంక్షోభాన్ని నివారించేందుకు దౌత్యపరంగా చైనా కీలక నిర్ణయం ప్రకటించింది. దానిలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి కోసం నాలుగు సూత్రాల ప్రతిపాదనను సమర్పించారు. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కీలకమైనదిగా ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం అబుదాబి యువరాజు షేక్ ఖాలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బీజింగ్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ ప్రతిపాదనను సమర్పించారు. ఇద్దరు నాయకుల మధ్య జరిగిన సమావేశంలో షీ జిన్‌పింగ్ మధ్యప్రాచ్యంలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఒక మార్గసూచిని, నాలుగు సూత్రాల ప్రతిపాదనను సమర్పించారు. వాటి ప్రకారం ప్రాంతీయ శాంతియుత సహజీవనానికి ప్రాధాన్యత ఇవ్వడం, జాతీయ సార్వభౌమాధికారాన్ని గౌరవించడం, అభివృద్ధి, భద్రత మధ్య సమతుల్యతను కాపాడుకోవడం, అంతర్జాతీయ నియమాల ఆధారిత వ్యవస్థను పరిరక్షించడం వంటి అంశాలను ప్రతిపాదించారు. ప్రపంచం తిరిగి అరాచక పాలనలోకి వెళ్ళడానికి అనుమతించలేమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
మధ్యలో జోక్యం చేసుకోవద్దు అమెరికాకు చైనా వార్నింగ్
ఇరాన్‌తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని చైనా అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధిని దిగ్బంధించాలనే ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ ఈ మేరకు హెచ్చరికలు చేశారు. ప్రపంచంలో శాంతి, స్థిరత్వానికి బీజింగ్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామన్నారు. హర్మూజ్ జలసంధిలో తమ నౌకల కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఇరాన్‌తో కుదుర్చుకున్న వాణిజ్య, ఇంధన ఒప్పందాలను బీజింగ్ గౌరవిస్తుందన్నారు. ఈ వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా అమెరికాను హెచ్చరించారు. జలసంధి ఇరాన్ నియంత్రణలోనే ఉందనీ, చైనా నౌకలకు అది తెరిచే ఉంటుందన్నారు. యుద్ధం ముగించే విషయంలో చైనా విదేశాంగశాఖ మద్దతును కొనసాగిస్తుందని తెలిపారు. హార్మూజ్ భద్రతపై ఆందోళనలు లేవనెత్తవద్దనీ, ఆ జలసంధి మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా నౌకల రవాణా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.



