నవతెలంగాణ-హైదరాబాద్ : గతంలో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించి, జైలుకు వెళ్లొచ్చిన ‘లేడీ అఘోరీ’ ఉదంతం మరోసారి తీవ్ర వివాదాస్పదమైంది. జైలు జీవితం తర్వాత సాధారణ జీవితం గడుపుతుందని భావించినప్పటికీ, ఆమె ఉత్తరాది రాష్ట్రాలకు మకాం మార్చి, అక్కడ కూడా అదే విధమైన విపరీతమైన చర్యలు, క్షుద్ర వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
తాజాగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని చక్రతీర్థ శ్మశానవాటికలో చిత్రీకరించిన ఒక షాకింగ్ వీడియోను లేడీ అఘోరీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. చేతిలో కత్తి పట్టుకుని, మండుతున్న చితి వద్దకు వెళ్లిన లేడీ అఘోరీ… చితి నుంచి మానవ శరీర భాగాలను (మాంసం) కత్తితో బయటకు తీసి తింటున్నట్లు వీడియోలో కనిపించింది.
“ఈ రోజు మనిషి మాంసాన్ని తింటున్నాను, ఇది వేడిగా, చాలా రుచిగా ఉంది. మీరు చనిపోయినా మిమ్మల్ని కూడా ఇలాగే తింటాను. పెద్ద పెద్ద మాంత్రికులనే ఎదురించాను, నాతో జాగ్రత్తగా ఉండండి” అంటూ బెదిరింపులకు దిగింది. శ్మశానంలో గడపడం, భూతప్రేతాలతో ఆడుకోవడమే తన పని అని వ్యాఖ్యానించింది. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను మరోసారి అరెస్ట్ చేసి, జైలుకు పంపాలని కామెంట్ చేస్తున్నారు.



