నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB) లో నకిలీ నోట్ల స్కాం వెలుగులోకి వచ్చింది. బ్యాంకులోని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన అసలు కరెన్సీ నోట్లను మాయం చేసి.. వాటి స్థానంలో అచ్చం అలాగే ఉండే నకిలీ నోట్లను పేర్చినట్లు బయటపడింది. ఏకంగా రూ.7కోట్ల 40 లక్షల మేర రియల్ కరెన్సీని నకిలీ నోట్లతో మాయం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నోడల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ చౌబే ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సదర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో సీనియర్ డివిజనల్ మేనేజర్ రవి కుమార్, కరెన్సీ చెస్ట్ మేనేజర్లు సుశీల్ శర్మ, అమిత్ కుమార్‌లను ప్రధాన నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం నోట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండటంతో.. మొత్తం ఎంత మోసం జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.నకిలీ నోట్లను బ్యాంకులోకి ఎలా స్మగ్లింగ్ చేశారు.. దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో విచారణ సాగుతోంది.



