- 1000 రోజుల్లో సంక్షేమానికి లక్షా 76వేల కోట్లు ఖర్చు
నవతెలంగాణ హైదరాబాద్: ప్రజల కోరిక మేరకు ప్రజాప్రభుత్వం పాలన చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం 3475 రోజుల్లో చేసిన 8లక్షల 20వేల కోట్లు అప్పులకు ప్రతి నెలా రూ. 6500కోట్లు అప్పు చెల్లిస్తూనే సంక్షేమం అభివృద్ధి పథకాలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిన సందర్భంగా బుధవారం సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్. వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్,ఎంపీ వేం నరేందర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో బి ఆర్ ఎస్ బిజెపి ఏకమై ప్రభుత్వానికి అడ్డుతగులుతున్నా సంక్షేమాన్ని ఆపలేదన్నారు. బిఆర్ ఎస్ హయాంలో తీసుకొచ్చిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూ, గత ప్రభుత్వంలో పెండింగ్ బిల్లులను చెల్లించి మరింత సంక్షేమం అందిస్తున్నామని వివరించారు.
కాళేశ్వరం కూలిన తర్వాతే రాష్ట్రంలో అత్యధిక ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. రైతుకి భరోసా,భద్రత కల్పించాం.పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి 72వేల నియామకాలు చేపట్టాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకునేలా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందనీ పేర్కొన్నారు. ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు చేయాల్సింది పోయి బిఆర్ఎస్ ప్రజల్ని రెచ్చగొడుతోందని విమర్శించారు. సంస్కారహీనంగా మాట్లాడుతున్న బావ బావమర్దులను తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసిన రాష్ట్రాన్ని సరిచేసుకుంటూ పోతుంటే కారుకూతలు కూయటాన్ని ప్రజలు గమనిస్తున్నారని పొంగులేటి అన్నారు. విద్యావ్యవస్థను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ప్రజాప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ప్రజారంజక పాలన అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి పొంగులేటి వివరించారు.



