నవతెలంగాణ – హైదరాబాద్ : ఇరాన్-అమెరికా మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఘర్షణను తీవ్రం చేస్తూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) అమెరికాకు చెందిన విమాన వాహక నౌక, డెస్ట్రాయర్‌పై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసినట్లు ప్రకటించింది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ చమురు ట్యాంకర్లను అమెరికా అడ్డుకుంటుండటంతో ఈ దాడులకు పాల్పడినట్లు తెలిపింది.
అమెరికా నౌకలు తీవ్రంగా దెబ్బతిని హర్మూజ్‌ను విడిచివెళ్లాయని ఇరాన్ పేర్కొంది. మరోవైపు తమ నౌకలు సురక్షితంగా తప్పించుకున్నాయని, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అమెరికా ప్రకటించింది. తమ నౌకాదళంపై దాడులు కొనసాగితే ఇరాన్ నౌకలపై మరింత తీవ్రంగా దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇరాన్ కూడా తమ నౌకలపై దాడులు కొనసాగితే గట్టి ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసింది.



