నవతెలంగాణ – హైదరాబాద్ : దేశంలోని న్యాయవ్యవస్థలో కీలక నియామకాలు జరిగాయి. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల మేరకు ఎనిమిది హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను (సీజే) నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాల వివరాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. కొలీజియం సిఫార్సు చేసిన కొద్ది రోజులకే కేంద్రం వేగంగా స్పందించి ఈ నియామక ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం.
నియామకాల వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అదేవిధంగా బాంబే హైకోర్టుకు చెందిన జస్టిస్ రవీంద్ర వి. ఘుగే కలకత్తా హైకోర్టుకు నేతృత్వం వహించనున్నారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ అగర్వాల్‌ను రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేష్ చంద్ర త్రిపాఠి బాంబే హైకోర్టు కొత్త సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు.



