Tuesday, September 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహరీశ్‌రావుపై స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం

హరీశ్‌రావుపై స్పీకర్‌ తీవ్ర ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా వాడీవేడిగా సాగుతోంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు సభలో తీవ్ర దుమారం రేపాయి. ఈ అంశంపై చర్చ జరుగుతుండగా బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావుపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హరీశ్‌ రావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డితో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ.. మహిళా నేతలపై దాడి జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అదే సమయంలో తాతా మధు తన తల్లిపై చేసిన వ్యాఖ్యల అంశాన్ని స్పీకర్‌ ప్రస్తావించారు. ‘‘నా తల్లిని అవమానించిన అంశంపై ఏం చెబుతారు?’’ అంటూ హరీశ్‌ రావును ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్‌, హరీశ్‌ రావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్‌బాబు మాట్లాడుతూ… స్పీకర్‌ను బెదిరించేలా బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరు ఉందన్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్న వ్యక్తిపై ఇలా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదన్నారు. స్పీకర్‌పై బెదిరింపు ధోరణితో సభ నడవదని గుర్తించాలన్నారు. ‘‘సభలో ఇబ్బందులు ఉన్నట్లు గుర్తిస్తే స్పీకర్‌ చర్యలు తీసుకుంటారు. సభను ఎలా నడపాలో మీరు ఎలా చెబుతారు? స్పీకర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారు. స్పీకర్‌ పట్ల మాట్లాడలేదు.. అలా భావిస్తే ఉప సంహరణ అంటున్నారు. బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలపై రికార్డులను ప్రజల ముందుంచితే స్పష్టత వస్తుంది.

మహిళా సభ్యుల విషయంలో చర్యలు తీసుకుంటామన్నా పట్టించుకోవట్లేదు. స్పీకర్‌ పట్ల దుర్భాషలాడిన విషయాన్ని పక్కన పెట్టాలని చెబుతున్నారు. స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడితే తప్పని చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది’’ అని శ్రీధర్‌బాబు అన్నారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పకుండా బీఆర్‌ఎస్‌ సభ్యులు రాజకీయం చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -