దోమలగూడ నుంచి ర్యాలీ.. ఇందిరాపార్కు సిగ్నల్ వద్ద ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆశా వర్కర్లకు రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపు నేపథ్యంలో ఆశాలు మంగళవారం చేపట్టిన ‘చలో హైదరాబాద్’ ఉద్రిక్తంగా మారింది. వారిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించింది. ఉదయం నుంచే ప్రధాన నాయకులు, కార్యకర్తలపై ఎక్కడికక్కడా నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు చేసింది. అయినా అనేక ఆటంకాలను అధిగమించి వేలాదిమంది ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ కు తరలివచ్చారు. దోమలగూడ నుంచి ర్యాలీగా బయలుదేరి ఇందిరాపార్కు సిగ్నల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశాలకు రూ.18 వేల వేతనం నిర్ణయించాలనీ, ఇతర డిమాండ్స్ అన్నింటినీ పరిష్కరించాలనీ, పోలీసుల జులుం ఆపాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య చాలాసేపు పెద్ద ఎత్తున ఘర్షణతో పాటు తోపులాటలు జరిగాయి. అనంతరం అరెస్టులు చేశారు. చాలా మంది ఆశాలకు గాయాలయ్యాయి. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ఈ సందర్భంగా ఆశా యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి మాట్లాడుతూ.. ఒకవైపు ప్రజాపాలన అంటూనే మరోవైపు నిర్బంధ పాలన కొనసాగించడం సరికాదన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేసుకునే అవకాశం కల్పించాలని ఈ నెల 4న పోలీసులను అనుమతి కోరినా.. అనుమతి ఇవ్వకపోగా నిర్బంధాన్ని ప్రయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ఉదయమే సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ రమ, తదితర నాయకులను, వేలాది మంది ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయటంతోపాటు అన్ని చోట్ల తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించిందన్నారు. నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18వేలు నిర్ణయించాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పని భారం తగ్గించాలని కోరారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వెలువడకపోతే ఫిక్స్‌డ్ వేతనం అమలయ్యే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆగస్టు 14న ప్రజావాణిలో ఇచ్చిన వినతి పత్రంలోని డిమాండ్స్ అన్నింటినీ పరిష్కరించాలని, లేదంటే ఆశా వర్కర్లందరూ నిరవధిక సమ్మెకు సిద్ధమవుతారని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆర్.నీలాదేవి, కోశాధికారి పి.గంగమణి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు జె.వెంకటేశ్, పాలడుగు సుధాకర్, హైదరాబాద్ సెంట్రల్ కమిటీ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు దశరథ, సౌత్ కమిటీ జిల్లా అధ్యక్షురాలు మీన, ఆశా రాష్ట్ర నాయకులు శ్రీలత, యశోద, రేవతి, బాలమణి, సావిత్ర, ప్రవీణ, శ్రావ్య, రాజమణి, స్వరూప, అనిత, అమృత, మంగ పాల్గొన్నారు.
ఆశాల ‘చలో హైదరాబాద్’ ఉద్రిక్తం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



