ఉగ్రవాదులకు, బీఆర్‌ఎస్ సభ్యులకు తేడాలేదు
స్పీకర్ ను, మహిళలను అవమానించారు
ప్రజాస్వామ్యంలో ఉన్నామా?
మధ్యయుగాలవైపు వెళ్తున్నామా?
శుద్ధి చేయాల్సింది నేలను కాదు మనువాద భావజాలాన్ని
ఫాంహౌజ్‌లో సమావేశం నుంచి అన్ని ఘటనలపై సమగ్ర విచారణ
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, క్రిమినల్ కేసులు పెట్టి శిక్షిస్తాం
తప్పు చేసిన వారిని జైలుకు పంపుతాం : అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
‘‘పార్లమెంట్‌పై దాడి చేసిన వాళ్లకు, ముంబయిలో దాడులకు పాల్పడిన కసబ్‌కు, పుల్వామాలో సైనికులపై దాడి చేసిన ఉగ్రవాదులకు, ఉన్మాదంతో సభాపతిని అవమానించిన బీఆర్‌ఎస్ సభ్యులకు పెద్ద తేడా లేదు. ఉన్మాదానికిలోనై ఉసిగొల్పబడిన కొంతమంది ముష్కరులు అధికారులపై దాడులు చేయడమే కాకుండా సభాపతి కుర్చీని అవమానించేలా వ్యవహరించారు. వ్యక్తినే కాకుండా తల్లిని కూడా అవమానించారు. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది.’’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్పీకర్‌ను అవమానించిన ఘటనపై కేసీఆర్ స్పందించాలని కోరుతూ మంగళవారం ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్ వద్ద వెయ్యి డప్పులతో ముట్టడికి యత్నించగా.. బుధవారం ఫాంహౌజ్ పరిసర ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేసిందని అడిగేవారు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల పరిస్థితులను పరిశీలించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో రిజర్వేషన్లను కల్పించిందని వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఉత్తరాఖండ్‌లో ఓ మైదానంలో సభ నిర్వహించారని గుర్తు చేశారు.
ఆ మైదానంలో బీజేపీ అనుబంధ సంస్థ శ్రీరామసేన శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడం హేయమైన చర్య అని విమర్శించారు. దీన్ని ఈ సభ ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. ఇదిలా ఉండగానే రాష్ట్రంలో మరో దురదృష్టకర సంఘటన జరిగిందని చెప్పారు. ఎర్రవెల్లి ఫాంహౌజ్ వద్ద దళితులు డప్పు కొడితే మైల పడిందంటూ శుద్ధి చేశారని వివరించారు. విద్యా రంగంలో పరిణామాలు, ధరణి అక్రమాలు, 22 ఏ రాద్ధాంతంపై సభలో చర్చించాలని అనుకున్నామని, కానీ ఫాంహౌజ్‌లో కుట్ర చేసి సభను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ సభ్యులను ఉసిగొల్పారని విమర్శించారు. సమస్యలపై చర్చ జరిగితే పదేండ్ల దురాగతాలు, తప్పులు, అప్పులపై ప్రజలకు తెలుస్తుందనే ఈ కుట్రకు పాల్పడ్డారని తెలిపారు. అంతేకాక సభాపతి మనసుకు గాయం చేయాలని ఉన్మాదంతో మాట్లాడారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ స్పీకర్‌కు ఫోన్‌చేసి క్షమాపణ చెప్పి వారి సభ్యులతో క్షమాపణ చెప్పించి సభ సజావుగా జరిగేలా చూస్తారని అంతా భావించారని వివరించారు. అలా జరగకపోగా మరింత ఉన్మాదంతో వ్యవహరించారని విమర్శించారు. ఫాంహౌజ్‌లో ఏం కుట్ర జరిగిందో అక్కడ దండోరా వేయాలని ప్రజాస్వామ్యవాదులు నిరసనకు దిగారని గుర్తు చేశారు.
ఉన్మాదానికి తెగబడలేదనీ, డప్పు దరువులతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారని అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా? అని ప్రశ్నించారు. ప్రతినిధి బృందాన్ని పిలిచి మాట్లాడి జరిగిన సంఘటనపై కేసీఆర్ బాధ్యతతో వ్యవహరించాల్సి ఉండాల్సిందని చెప్పారు. దళితులు తిరిగిన నేలను శుద్ధి చేయాలని ఆదేశించి తీవ్రంగా అవమానించారన్నారు. మధ్యయుగాల్లో చక్రవర్తులు కూడా ఇలాంటి క్రూరమైన, నీచమైన ఆలోచన చేయలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మధ్యయుగాల వైపు వెళ్తున్నామా?, రాతి యుగంలో ఉన్న రాక్షసులమా?అని ఆయన ప్రశ్నించారు.
సమాజాన్ని రెండుగా చీల్చే కుట్ర
సమాజంలో అశాంతిని ప్రోత్సహించి సమాజాన్ని రెండు జాతులుగా చీల్చి వాటి మధ్య వైరంగా మార్చే కుట్ర చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి, ధనబలంతో వ్యవస్థలను లొంగదీసుకోవాలనుకున్నారని చెప్పారు. దళితులు నడిచిన నేలను శుద్ధిచేస్తే వారి మనసుల్లో పేరుకున్న అంటరాని తనాన్ని ఎలా శుద్ధి చేయాలని అడిగారు. నీళ్లతో కడగాలా? యాసిడ్‌తో కడగాలా? అని ప్రశ్నించారు. దళితుడు దుక్కి దున్ని పంట పండిస్తే అందరి కడుపులు నిండుతున్నాయని చెప్పారు. శుద్ధి చేయాల్సింది దళితులు నడిచిన నేలను కాదనీ, దొర అహంకారం, అంటరానితనం ఆలోచనలను, మనువాద భావజాలాన్ని, ఫ్యూడల్ మనస్తత్వాన్ని అని అన్నారు. స్పీకర్‌ను అవమానించిన వారిని చట్టపరంగా శిక్షించాలని ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని తెలిపారు. తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్తే వారి కిరీటం ఊడి కింద పడుతుందా?అని ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గేకు, గడ్డం ప్రసాద్ కుమార్‌కు జరిగిన అవమానం ఈ సమాజానికి జరిగినట్టేనని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేయాలన్నారు.
విచారణ అధికారిగా విజయ్‌కుమార్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం ఎంతటివారినైనా ప్రభుత్వం విచారణ చేపట్టి శిక్షించాలని నిర్ణయించిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కుట్రలు పన్నిన వారితోపాటు కుట్రలో భాగస్వాములైన వారిని చట్టపరిధిలో శిక్షిస్తామన్నారు. ఈనెల 6న ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ సమావేశంలో జరిగిన కుట్ర నుంచి ఆ తర్వాత అసెంబ్లీ ముందు ఘటన, ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు, ఫాంహౌజ్ ముందు దళితుల డప్పులు వాయించడం, శుద్ధి చేయడం వంటి అన్ని సంఘటనలను క్రోడీకరించి అందరిపై సమ్రగ విచారణకు ఆదేశించామని చెప్పారు. విచారణ అధికారిగా హైదరాబాద్ జాయింట్ సీపీ విజయ్‌కుమార్ వ్యవహరిస్తారని వివరించారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రత్యక్షంగా భాగస్వాములైన వారితోపాటు పరోక్షంగా సహకరించిన వారిని శిక్షిస్తామన్నారు. నిజాంను సాయుధ రైతాంగ పోరాటం ద్వారా మట్టికరిపించిన చరిత్ర నేలకు ఉందని చెప్పారు. ఆత్మగౌరవం కోసం పోరాడిన ఈ సభ చూస్తూ ఊరుకోబోదని అన్నారు. స్పీకర్ మానసిక ధైర్యం కోల్పోవద్దని చెప్పారు. మనసును గాయపరిచిన వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. చట్టాలు, సెక్షన్లు అడ్డు పెట్టుకుని కొంతమంది బెయిల్ పొందొచ్చనీ, తెలంగాణ సమాజం బెయిల్ ఇవ్వదని చెప్పారు. ప్రభుత్వం ఉక్కుపాతర వేస్తుందనీ, తప్పు చేసిన వారిని శిక్షించి జైలుకు పంపుతామని హెచ్చరించారు. అనంతరం సభను గురువారం ఉదయం పది గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.



