Thursday, September 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅక్రమ నిర్మాణాలను అడ్డుకోండి

అక్రమ నిర్మాణాలను అడ్డుకోండి

- Advertisement -

రాష్ర్ట ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రెండు అంతస్తులు మాత్రమే నిర్మించాల్సిన114.14 చదరపు గజాల స్థలంలో గౌండ్‌ ప్లస్‌ అయిదు లేదా ఆరు అంతస్తుల నిర్మాణం చేపట్టడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 75 చదరపు గజాల వరకు స్వీయ ధ్రువీకరణతో నిర్మాణాలకు అవకాశం ఉన్న నిబంధనను దుర్వినియోగం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. సిద్దంబజార్‌, బేగంబజార్‌లో నిర్మాణాలను పరిశీలించి అనుమతులు ఉన్నాయో, నిబంధనల ప్రకారమే పనులు జరుగుతున్నాయో తనిఖీ చేయాలని ఆదేశించింది. సిద్దంబజార్‌లో పిటిషనర్‌ చేపట్టిన నిర్మాణానికి సీలు వేసి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

రాజ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు. 114.14 చదరపు గజాల్లో గౌండ్‌ ప్లస్‌ రెండంతస్తులకు మాత్రమే అనుమతి సాధ్యమైనప్పుడు నాలుగు, ఐదు అంతస్తుల నిర్మాణాన్ని ఎలా క్రమబద్ధీకరించాలని కోరుతున్నారో అర్థం కావడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలను సెక్షన్‌ 455ఎ, 455ఏఏ కింద క్రమబద్ధీకరించే అవకాశం లేదన్నారు. నిర్మాణ అనుమతులను ప్రదేశాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని, ఉల్లంఘనలు ఉంటే పనులను అడ్డుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

కమిషన్‌ నియామకాలపై వివరాలివ్వండి: హైకోర్టు
జిల్లా వినియోగదారుల కమిషన్ల అధ్యక్షులు, సభ్యుల నియామకాలపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అర్హతలు లేనివారిని నియమించారంటూ న్యాయవాది విజయ్‌గోపాల్‌ దాఖలు చేసిన కోవారెంటో పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ జరిపారు. పలువురు అధ్యక్షులు, సభ్యులకు నిర్దేశిత అర్హతలు లేవనీ, సంబంధిత పరీక్షల్లో ఉత్తీర్ణతకు సంబంధించిన రికార్డులు కూడా లేవని పిటిషనర్‌ తెలిపారు.
నియామకమైన అధ్యక్షుల అర్హతలు, ఎంపిక ప్రక్రియ, సెలక్షన్‌ కమిటీ సిఫారసులు, ప్రభుత్వ ఆమోదం తదితర వివరాలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామంది. జిల్లా జడ్జి అర్హతలున్న న్యాయవాదులను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు జడ్జిలుగా నియమిస్తున్నప్పుడు జిల్లా వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షులుగా ఎందుకు నియమించరాదని న్యాయమూర్తి ప్రశ్నించారు. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు.

ఉదయ్‌కృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట
ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఎం.ఉదయ్‌కృష్ణారెడ్డికి లైంగిక సామర్థ్య పరీక్ష నిర్వహించేందుకు కింది కోర్టు ఇచ్చిన అనుమతిని హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ జె.శ్రీనివాసరావు విచారణ చేపట్టారు. ప్రాసిక్యూషన్‌ దాఖలు చేసిన దరఖాస్తు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదనీ, మద్రాసు, కర్ణాటక హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను కూడా పాటించలేదని హైకోర్టు పేర్కొంది. అవసరమైతే చట్టప్రకారం తగిన పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -