నవతెలంగాన – హైదరాబాద్ : కేరళంలోని త్రిస్సూర్ లో బాణా సంచా పేలుడు ఘటనను విజయన్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. ఈ ఘటనను రాష్ట్ర విపత్తుగా కేరళం మంత్రివర్గం బుధవారం విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్ డి ఎంఎ)ని ఆదేశించింది. ఈ ప్రమాదంపై న్యాయవిచారణకు ఆదేశించింది. జస్టిస్ సి.ఎన్. రామచంద్రన్ నాయర్ నేతృత్వంలో న్యాయ కమిషన్ పర్యవేక్షించనుంది. మృతుల కుటుంబాలకు రూ.14 లక్షల అత్యవసర ఆర్థిక సహాయం అందించనున్నట్లు విజయన్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుండి రూ.4 లక్షలు, సిఎం విపత్తు సహాయ నిధి (సిఎండిఆర్ ఎఫ్)నుండి రూ.10 లక్షలు కేటాయించినట్లు తెలిపింది. గాయపడిన వారికి ఎస్ డిఎంఎ నిధి కింద కేటాయించిన మొత్తాన్ని ఇవ్వనున్నారు. అదనంగా సిఎండి ఆర్ ఎఫ్ నుండి రూ.2లక్షలు అత్యవసర ఆర్థిక సహాయం కింద అందించనున్నారు.
ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో గాయపడిన వారి చికిత్స ఖర్చులను ఆరు నెలల పాటు ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్ సిఫార్సు ఆధారంగా సిఎండిఆర్ఎఫ్ నుండి కేటాయిస్తారు. అదనంగా, విపత్తు ప్రతిస్పందన నిధి నుండి అనుమతించబడిన మొత్తాన్ని వైద్య సహాయంగా అందిస్తారు. ఒకవేళ ఆరు నెలల కంటే ఎక్కువ కాలం చికిత్స అవసరమైతే, సిఫార్సు చేయబడిన ప్రైవేట్ ఆసుపత్రులలోని చికిత్స ఖర్చులను వైద్య మండలి నిర్ణయం ఆధారంగా సీఎండీఆర్ఎఫ్ నుండి కేటాయించనున్నట్లు వెల్లడించింది.
ప్రమాదం అనంతరం గాలింపు, సహాయక చర్యలను సులభతరం చేసేందుకు ఆ ప్రాంతంలోని ప్రైవేట్ గోడలను కూల్చివేయడంతో పాటు వరి పొలాలను చదును చేసి పూడ్చివేయాల్సి వచ్చింది. గోడల పునరుద్ధరణ కోసం అయ్యే ఖర్చును, రైతులకు పరిహారాన్ని జిల్లా కలెక్టర్ సిఫార్సు ఆధారంగా విపత్తు ప్రతిస్పందన నిధి నుండి కేటాయించనున్నారు. మృతదేహాలను ఖననం చేయడానికి మరియు డిఎన్ ఎ పరీక్షల కోసం నమూనాలను సేకరించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్ ఒపి ) జారీ చేయాలని ఎస్ డి ఎం ఎ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీకి సూచించింది. పేలుడు కారణంగా సమీపంలోని నివాసాలకు జరిగిన నష్టంపై తక్షణమే నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఎస్ డి ఆర్ ఎఫ్ నుండి పరిహారం అందించాలని సూచించింది.



