నవతెలంగాణ-హైదరాబాద్ : వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్‌లో 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’ కొలువుదీరాడు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు తొలి పూజ చేశారు. తొలుత మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, కమిటీ సభ్యులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికి విగ్రహం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం అర్చకులు గవర్నర్ దంపతులతో పూజలు చేయించారు. ఖైరతాబాద్ గణనాథుడికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గణేశ్ ఉత్సవాలు మహారాష్ట్రలో ప్రారంభమైనప్పటికీ, ఖైరతాబాద్ గణేశుడి విగ్రహానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 72 ఏళ్లుగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమన్నారు. ప్రజలంతా గణపతి ఆశీస్సులతో సుభిక్షింగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.


