కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన
నవతెలంగాణ – హైదరాబాద్: కామారెడ్డి జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాత బస్టాండ్ ట్రాఫిక్ బూత్ ని వినాయక మండపంగా మార్చి హెల్మెట్ ధరించిన వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారం జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర మండపాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు రహదారి భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. హెల్మెట్ అనేది కేవలం ట్రాఫిక్ నిబంధనలో భాగం కాదు, ప్రమాద సమయంలో మన ప్రాణాలను కాపాడే రక్షణ కవచమన్నారు. వినాయకుడి దర్శనం చేసుకుని క్షేమంగా ఇంటికి చేరుకోవాలి, వచ్చే ఏడాది కూడా స్వామివారి దర్శనానికి రావాలి, అందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి జాగ్రత్తగా ప్రయాణించాలన్నారు. భక్తి వాతావరణాన్ని ప్రాణ భద్రతతో అనుసంధానం చేస్తూ “హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.



