నవతెలంగాణ-హైదరాబాద్: దేశంలో మైనారిటీలపై సంఘ పరివార్ గ్రూపులు సాగిస్తున్న ద్వేషపూరిత ప్రచారానికి, బెదిరింపులకు ఐపీఎస్ అధికారి డా. బుష్రా బాను తాజా బాధితురాలిగా మారారు. ఖరగ్‌పూర్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ బుష్రా బానో హఠాత్ బదిలీ దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించడానికి తనకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (AMU)కి చెందిన ‘రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ’ ఎంతగానో సహాయపడిందని వివరిస్తూ ఆమె ఇటీవల ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వెలువడిన రెండున్నర నెలలకే ఆమెను పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సాయుధ దళాల (SAP) 4వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
‘హిందూ లీగల్ ఫండ్’ అనే సంస్థ ఈ వివాదంలో ప్రధాన పాత్ర పోషించింది. వీడియోలో బుష్రా బానో ‘అస్సలాము అలైకుమ్’, ‘ఇన్షా అల్లాహ్’ అనే పదాలను వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సంస్థ రాష్ట్ర హోమ్ కార్యదర్శికి ఫిర్యాదు చేసింది. “ప్రభుత్వ హోదాలో ఉన్న అధికారిణి ‘వందేమాతరం’ లేదా ‘జై హింద్’ అనకుండా, మతపరమైన పదాలు ఎలా వాడతారు?” అని సదరు సంస్థ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించింది. సెప్టెంబర్ 14న ఫిర్యాదు అందిన వెంటనే స్పందించిన ప్రభుత్వం… ఆమెను బదిలీ చేసి, ఖరగ్‌పూర్ అడిషనల్ ఎస్పీగా పార్థ ఘోష్‌ను నియమించింది.
అయితే, సువేందు అధికారి ప్రభుత్వం ఈ బదిలీని సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేనని ప్రకటించినప్పటికీ, మతపరమైన ఒత్తిళ్లకు లొంగే ఈ చర్య తీసుకున్నారని విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించేందుకు ఒక అధికారిణి చేసిన వ్యక్తిగత సందేశాన్ని ప్రభుత్వ ప్రకటనగా చూడలేమని, దాంట్లో వాడిన సాధారణ సంభాషణలపై అభ్యంతరం చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో బహిరంగంగా మతపరమైన ప్రసంగాలు చేస్తున్నప్పుడు లేని అభ్యంతరం, ఒక ముస్లిం అధికారిణి సాధారణ మాటలు మాట్లాడితే ఎందుకు అభ్యంతరం వస్తోందని విపక్షాలు నిలదీస్తున్నాయి.
సైబర్ దాడి : ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, బుష్రా బాను ఫొటోలను జోడించి ఆమెపై విపరీతమైన ట్రోలింగ్, సైబర్ దాడులు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛను, లౌకిక విలువలను పూర్తిగా కాలరాస్తూ బిజెపి దేశంలో వర్గ విద్వేషాన్ని రెచ్చగొడుతోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, బుష్రా బానో ప్రస్తావించిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సంస్థ కూడా నిరంతరం సంఘపరివార్ లక్ష్యంగా మారుతోందని, అయినప్పటికీ యూపీఎస్సీ శిక్షణలో ఆ సంస్థ సాధిస్తున్న అత్యుత్తమ ఫలితాలను ఎవరూ విస్మరించలేరని పలువురు గుర్తుచేస్తున్నారు



