నవతెలంగాణ-సంగారెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్షతో ఒంగోలుకు చెందిన ఏపీ హైకోర్టు అడ్వకేట్ వెంకటేశ్వర్లు చేపట్టిన పాదయాత్ర గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెంకటేశ్వర్లు పాదయాత్రకు స్వాగతం పలికి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నది దేశంలోని సామాన్య ప్రజలందరి అభిప్రాయమని, అదే వెంకటేశ్వర్లు పాదయాత్రలో సైతం వ్యక్తం అవుతోందనీ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. వెంకటేశ్వర్లు ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాల మీదుగా సుమారు 1,590 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారనీ, తన ప్రయాణంలో భాగంగా హోటళ్లు, రహదారుల వెంట ఉన్న టీ స్టాళ్లు, పొలాలు, పరిశ్రమలు తదితర ప్రాంతాల్లో సామాన్య ప్రజలను కలుసుకుంటూ వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారని చెప్పారు.
ఇప్పటివరకు సుమారు 30 వేల మందిని కలిసిన వెంకటేశ్వర్లు తన పాదయాత్ర అనుభవాలను తనతో పంచుకున్నారని తెలిపారు. దేశ ప్రజలతో మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలనే అభిప్రాయం వ్యక్తమవుతోందని వెంకటేశ్వర్లు చెప్పారని అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన ఈ పాదయాత్ర మొత్తం సుమారు 4,500 కిలోమీటర్ల మేర కొనసాగుతుందని, దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రలు, దేశం కోసం ఆయన కుటుంబం చేసిన త్యాగాలను ప్రజలకు వివరిస్తూ వెంకటేశ్వర్లు ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలు సంతోషంగా, సంక్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ఆయన ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని చేపట్టారని పేర్కొన్నారు.
పాదయాత్ర పూర్తయిన అనంతరం వెంకటేశ్వర్లును స్వయంగా తీసుకెళ్లి రాహుల్ గాంధీని కలిపిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోపాజి అనంత కిషన్, ఆంజనేయులు, కూన సంతోష్, కిరణ్ గౌడ్, గంగేరి శ్రీహరి, వంశీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



