నవతెలంగాణ-అచ్చంపేట
పట్టణంలోని భవిత సెంటర్ లో దివ్యాంగ విద్యార్థులకు అలింకో వైద్య బృందం సౌజన్యంతో గురువారం పరికరాల నిర్ధారణ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి అరుంధర్ రావు, మండల విద్యాధికారి శ్రీనివాసమూర్తిలు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ శిబిరానికి అచ్చంపేట డివిజన్ పరిధిలోని ఆయా మండలం వివిధ పాఠశాలల నుండి 43 మంది దివ్యాంగ విద్యార్థులు హాజరై వైద్య పరీక్షలు పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. దివ్యాంగ విద్యార్థుల చదువుకు, దైనందిన జీవితంలో స్వతంత్రంగా ముందుకు సాగడానికి ప్రభుత్వం భవిత కేంద్రాల ద్వారా పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. శిబిరానికి వచ్చిన 43 మంది విద్యార్థుల వైకల్య శాతాన్ని, వైకల్య స్థితిని అలింకో వైద్య నిపుణుల బృందం సమగ్రంగా పరిశీలించి వారికి అవసరమైన వినికిడి యంత్రాలు, చక్రాల కుర్చీలు, క్యాకేలియర్లు ఇతర సహాయక పరికరాల వివరాలను నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఎంపిక చేసిన పరికరాలను అర్హులైన విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అలింకో వైద్య బృందం, ప్రత్యేక ఉపాధ్యాయులు ఐఈఆర్పీలు, భవితా కేంద్ర సిబ్బంది, దివ్యాంగ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.



