అమరవీరుల త్యాగాలను ప్రజలు స్మరించుకోవాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు
నవతెలంగాణ-అచ్చంపేట
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా గురువారం సీపీఐ(ఎం) పార్టీ నాయకులు పట్టణంలో వీరనారి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో బైక్ జాతను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సీపీఐ(ఎం) నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు ముఖ్యఅతిథిగా పాల్గొని అంబేడ్కర్ చౌరస్తాలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్ధం పర్వతాలు మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటం 1946–1951 మధ్య నాటి కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన రైతాంగ పోరాటమని తెలిపారు. నైజాం నిరంకుశ పాలన, భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పేద రైతులు, కూలీలు, సామాన్య ప్రజలను సమీకరించి కమ్యూనిస్టులు పోరాటాన్ని ముందుకు నడిపారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం వేలాది మంది రైతులు పోరాటంలో పాల్గొన్నారని, అనేక మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన రైతాంగ ఉద్యమంగా చరిత్రలో నిలిచిందని చెప్పారు. ఈ పోరాటానికి నేటి బీజేపీకి ప్రత్యక్ష సంబంధం లేదని చారిత్రకంగా స్పష్టం చేయాలన్నారు. బీజేపీ స్వయంగా ప్రచురించిన పార్టీ చరిత్ర ప్రకారం ఆ పార్టీ 1980 ఏప్రిల్ 6న ఏర్పడింది. తెలంగాణ సాయుధ పోరాటం మాత్రం 1946లో ప్రారంభమై 1951 వరకు కొనసాగిందని తెలిపారు. అందువల్ల 1946–51 నాటి పోరాటంలో బీజేపీ అనే పార్టీ పాల్గొనడం సాధ్యం కాదన్నారు.
అమరవీరుల చరిత్రను తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మార్చకుండా, తెలంగాణ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు నిర్వహించిన పాత్రను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం, వారి పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అనంతరం అచ్చంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన సాయుధ పోరాట అమరుడు ఎలకొండ కాశన్న, అలాగే చెంచుపలుగు తండాకు చెందిన అమరుడు తార్య నాయక్ స్తూపాల వద్ద సీపీఐ(ఎం) నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశనాయక్, జిల్లా కమిటీ సభ్యులు శంకర్ నాయక్, మల్లేష్, నిర్మల, మండల కార్యదర్శి వర్ధం సైదులు, సిఐటియు టౌన్ సెక్రెటరీ రాములు, రేనయ్య, గౌస్, గోపాల్, లాలా హైమద్, శ్రావణ్ కుమార్, పర్వతాలు, వెంకటయ్య, జంగయ్య, రాధాకృష్ణ లు ఉన్నారు.


