మూడేండ్ల రేవంత్‌రెడ్డి, పదేండ్ల కేసీఆర్ పాలనపై చర్చకు సిద్దమా?
రైతు బంధు ఎగ్గొట్టిన ఘనత సీఎందే :మాజీ మంత్రి హరీశ్ రావు
ఆలేరు నియోజకవర్గం మోటకొండూరులో పలువురు టీఆర్ఎస్లో చేరిక
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్/ మోటకొండూరు
తెలంగాణలో రైతు పాలన పోయి రాక్షస పాలన వచ్చిందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. కేసీఆర్ పాలనను ప్రజలంతా చూశారని, రైతులకు మూడు పంటల రైతుబంధు ఎగ్గొట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని విమర్శించారు. మూడేండ్ల రేవంత్ రెడ్డి పాలనపై, పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై విచారణకు తాము సిద్ధమని, రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టేసి రుణమాఫీ చేస్తానని చెప్పి దేవుడిని సైతం మోసం చేశారని తెలిపారు. యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో భారీగా చేరికలు జరిగాయి. ముందుగా వంగపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీతో మోటకొండూరు మండల కేంద్రానికి వచ్చారు. అనంతరం బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మోటకొండూరు మండల సీనియర్ నాయకులు, మాజీ మండల అధ్యక్షులు సిరబోయిన మల్లేష్ యాదవ్, అనంతుల శోభన్ రెడ్డి, మెట్టు పద్మారెడ్డితో పాటు సుమారు 1000 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తన్నీరు హరీశ్ రావు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు తక్కువ పంట దిగుబడులు, యూరియా కొరత, మోటార్లు లో వోల్టేజీతో కాలిపోవడం వంటి సమస్యలు దురవుతున్నాయని తెలిపారు. డీఏపీ ధర పెంచారని, రైతు బీమా పరిస్థితి ఏమిటో తెలియడం లేదని ఆరోపించారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇష్టం లేకనే కోతలు పెడుతున్నారని అన్నారు. ఏఎంఆర్, ఎస్ఎల్బీసీ మోటర్లు నడవకపోవడంతో సాగునీరందడం లేదన్నారు. ప్రశ్నిస్తే కేసులు, జైలుకు పంపుతున్నారని, సోషల్ మీడియాలో కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆలేరు ఎమ్మెల్యేపై భూకుంభకోణాల ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమిషన్ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, డీసీసీబీ మాజీ చైర్మెన్, టెస్కాబ్ మాజీ వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నల్లగొండ జిల్లా జెడ్పీ మాజీ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మదర్ డెయిరీ మాజీ చైర్మెన్ లింగాల శ్రీకర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, బీఆర్ఎస్ నాయకులు కల్లూరి రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



