మాస్కో చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్ ఎటాక్
ఇద్దరు మృతి, 20 మందికిపైగా గాయాలు
మాస్కో: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. పార్లమెంటర్ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మునుపెన్నడూ లేని స్థాయిలో రాత్రికిరాత్రే వందలాది డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పలు భవనాలు, చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతిన్నాయి. మరోవైపు, ఉక్రెయిన్ ప్రయోగించిన చాలా డ్రోన్లను తమ బలగాలు మార్గమధ్యంలోనే అడ్డుకున్నాయని రష్యా ప్రకటించింది.
మాస్కో ఆయిల్ రిఫైనరీలో పెద్దఎత్తున మంటలు
ఉక్రెయిన్ దాడుల కారణంగా మాస్కో ఆయిల్ రిఫైనరీలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో సమీప ప్రాంతాల్లో భారీగా పొగ వ్యాపించింది. పలు నివాసాలు దెబ్బతిన్నాయి. మాస్కో చరిత్రలోనే అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని అధికారులు తెలిపారు. మాస్కో వైపు దూసుకొచ్చిన 450కుపైగా డ్రోన్లను అడ్డుకున్నట్టు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. అటు రష్యా ఆక్రమిత క్రిమియాపైనా ఉక్రెయిన్ పెద్దఎత్తున దాడులు కొనసాగిస్తోంది. సైనిక సరఫరాలను, విద్యుత్తు వ్యవస్థల్ని స్తంభింపజేసేలా తాజా దాడులు జరిపింది. వీటి కారణంగా మాస్కోలోని ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో పలు విమాన సర్వీసులు రద్దుకాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
యుద్ధం అనంతరం తొలిసారిగా ఎన్నికలు
మరోవైపు, ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాలో తొలిసారిగా పార్లమెంటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్షుడు పుతిన్ విధానాలను వ్యతిరేకించే ప్రతిపక్షం దాదాపుగా లేకుండా సాగుతున్న ఈ ఎన్నికల ద్వారా క్రెమ్లిన్ ఆధిపత్యం మరింత సుస్థిరం కానుంది. అయితే రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో కూడా పోలింగ్ నిర్వహించడాన్ని కీవ్ తీవ్రంగా తప్పుబట్టింది. రష్యా ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకే ఉక్రెయిన్ తాజా దాడులకు పాల్పడిందని, అయితే ఆ కుట్రలో శత్రువులు విఫలమయ్యారని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ డ్రోన్లను సమర్ధవంతంగా కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా రాజధాని వైపు వస్తున్న 450 డ్రోన్లను మార్గమధ్యంలో ధ్వంసం చేశారని మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు.
అత్యాధునిక డ్రోన్ సాంకేతికత
ఇదిలా ఉండగా, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేండ్లు గడుస్తుంది. అయినప్పటికీ ఇరుపక్షాల సైనికులు ప్రతిదాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ సైనిక డ్రోన్ సాంకేతికతలో ప్రపంచ అగ్రగామిగా నిలిచింది. రష్యా లోపలికి చొచ్చుకెళ్లి దాడులు చేయడానికి, దేశీయంగా ఉత్పత్తి చేసిన సుదూర డ్రోన్లతో పాటు క్షిపణులను కూడా మోహరిస్తోంది. అయితే, ఉక్రెయిన్ డ్రోన్ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలను, రక్షణ పరికరాల తయారీదారులను ఆకట్టుకుంది. శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తేవాలని కీవ్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, యుద్ధాన్ని ఆపే ఉద్దేశం ఉన్నట్టు పుతిన్ ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు చూపలేదు. దీంతో యుద్ధ ముగింపుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.
రష్యా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడే లక్ష్యం
ఈ దాడులపై
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. రష్యా చమురు, లాజిస్టిక్స్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు ఎక్స్ వెల్లడించారు. ఈ దాడుల్లో రష్యా చమురు కర్మాగారం దెబ్బతిన్నట్టు తెలిపారు. ఇందుకు గానూ, తమ సైనిక సిబ్బంది, గూఢచర్య విభాగా నికి కృతజ్ఞతలు తెలిపారు. అదే సమయంలో రష్యా యుద్ధ యం త్రాంగాన్ని నడిపిస్తున్న బిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇకనైనా మాస్కో యుద్ధాన్ని ముగించి, శాంతి దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నట్టు
జెలెన్స్కీ తెలిపారు.



