ప్రమాదంలో కారు దగ్దం
ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ హెచ్‌వోడీ కె. జగదీష్‌బాబుగా గుర్తింపు
హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లాలో ఘటన
హైదరాబాద్-ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి సమీపంలో వోల్వో కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు దగ్దమైంది. కాగా కారులో ఉన్న వ్యక్తి సజీవదహనయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం సుమారు 7.15 గంటల సమయంలో ఖమ్మంలోని మమత మెడికల్ కాలేజీ హెచ్‌వోడీ కె. జగదీష్‌బాబు ప్రయాణిస్తున్న వోల్వో కారు అదుపుతప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ ఎం.అనిల్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నెంబర్ ప్లేట్ సైతం పూర్తిగా కాలిపోవడంతో వాహనం, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవదహనమయ్యారు. వ్యక్తి వివరాలను నిర్దారించేందుకు పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం వైపు ఉన్న టోల్‌ప్లాజాల వద్ద సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు వాహనాల రికార్డులను పరిశీలించారు. వీటిని బట్టి మృతిచెందిన వ్యక్తిని గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా దగ్ధమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సూర్యాపేటకు చెందిన పలువురు వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించినట్టు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, మృతుని ప్రయాణ వివరాలు, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


