నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై గణేశ్ విగ్రహాల నిమజ్జనం అంశం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్ బండ్ వైపు విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ అధికారులు ఏర్పాటు చేసిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో ఉత్సవ సమితి ప్రతినిధులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
వివరాల్లోకి వెళితే.. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉత్సవ సమితి ప్రతినిధులు అక్కడ బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన కొన్ని బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.



