Wednesday, September 23, 2026
E-PAPER
Homeజిల్లాలుజూరాల సాగునీరు విడుదల..రైతుల విజయం: సీపీఐ(ఎం)

జూరాల సాగునీరు విడుదల..రైతుల విజయం: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ-ఆత్మకూరు
గత రెండు వారాలుగా జూరాల ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేయాలని రైతులు, సీపీఐ(ఎం) కలిసి చేసిన పోరాటం విజయం సాధించిందని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. బుధవారం అమరచింతలోని జీఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీఎస్ గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఎస్. రాజు, బి. వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు వై. అజయ్, పార్టీ సీనియర్ నాయకులు బుచ్చన్న, శ్యామ్ సుందర్ మాట్లాడారు.

జూరాల నుండి నేడు నీరు విడుదల చేయడం రైతుల పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతుగా ఆందోళనలు నిర్వహించడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందని వారు తెలిపారు. సాగునీరు విడుదల పట్ల సీపీఐ(ఎం) పార్టీగా హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కర్ణాటక ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న చర్చల్లో ఆల్మట్టి డ్యాం నుండి జూరాల డ్యాంకు ఎన్ని టీఎంసీల నీరు అడుగుతున్నారనే దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు.

 గత నెల రోజులుగా రాష్ట్రంలో రైతు బీమా ఇన్సూరెన్స్ కు ప్రభుత్వం ఎల్ఐసికి ప్రీమియం కట్టకపోవడంతో రైతు బీమా అమలవుతుందా లేదా అనే ఆందోళనలో రైతు కుటుంబాలు ఉన్నాయని, దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టత ఇవ్వాలని, గత బీఆర్ఎస్ హయాంలో మంత్రి నిరంజన్ రెడ్డి జూరాల నుండి నీళ్లు తరలించుకుపోయారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా డ్యాం పక్కన ఉన్న గ్రామాలకు నీళ్లు వదలకుండా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి చొరవ తీసుకొని డ్యాం పరిసర ప్రాంతాల్లోని చెరువులు, రిజర్వాయర్లను జూరాల నీటితో నింపాలని డిమాండ్ చేశారు. రైతులు, పార్టీలు పోరాడితే తప్ప ప్రభుత్వం దిగిరాని పరిస్థితి ఉందని విమర్శించారు. రైతు ఉద్యమాల పట్ల అక్రమ అరెస్టులు, నిర్బంధాలు సరికాదని, ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. రైతుల పంటలు చేతికొచ్చే వరకు జూరాల డ్యాం ద్వారా సాగునీటిని రోజువారీగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -