Homeతెలంగాణ రౌండప్ఘనంగా యంగ్ స్టార్స్ యూత్ మట్టి గణపతి నిమజ్జనం

ఘనంగా యంగ్ స్టార్స్ యూత్ మట్టి గణపతి నిమజ్జనం

- Advertisement -

మహిళల కోలాటాలు.. డప్పు చప్పుళ్లు.. భారీ ర్యాలీతో మార్మోగిన వావిలాల
నవతెలంగాణ-నెల్లికుదురు

వావిలాల గ్రామంలో యంగ్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణపతి విగ్రహాన్ని భారీ ర్యాలీగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. నిమజ్జన శోభాయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటాలతో సందడి చేయగా, యువత డప్పు చప్పుళ్లు, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో వావిలాల గ్రామంలోని గల్లీ గల్లీ మార్మోగింది. చిన్నారులు, మహిళలు, యువత, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.

యంగ్ స్టార్స్ యూత్ సభ్యులు ర్యాలీని క్రమబద్ధంగా నిర్వహిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన శోభాయాత్ర అనంతరం గణపతి విగ్రహాన్ని గ్రామ చెరువు వద్దకు తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. యువతను ఐక్యం చేస్తూ, భక్తి భావంతో గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన యంగ్ స్టార్స్ యూత్ సభ్యులను అభినందించారు. ప్రతి సంవత్సరం ఉత్సవాలను మరింత ఉత్సాహంగా నిర్వహిస్తూ గ్రామంలో ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకు యూత్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. యంగ్ స్టార్స్ యూత్ ఆధ్వర్యంలో వరుసగా గణపతి నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం భక్తి, ఆనందం, యువత ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -