రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాలు
పెరిగిన చక్కెర, బెల్లం,ఉల్లి, వంటనూనె ధరలు
నవతెలంగాణ – మల్హర్ రావు
పేదవాడికి ఆకలి లెక్క. మధ్య తరగతికి బడ్జెట్ లెక్క. ఉద్యోగికి జీతం-ఈఎంఐల లెక్క, ఇక ధనికుడికి ధరలతో పెద్దగా చింత లేదు. కానీ ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సమాజంలోని అన్నివర్గాల ఆర్ధిక పరిస్థితుల్లో అంతరం మరింత స్పష్టమవుతోంది. కూలీకి వచ్చే ఆదాయం రోజువారీ అవసరాలకే సరిపోగా..ఉద్యోగి జీతం అద్దె, పిల్లల చదువు, కిరాణ, రవాణా, ఈఎంఐలకే ఆవిరవుతోంది. మధ్యతరగతి కుటుంబాలు మాత్రం భవిష్యత్ కోసం దాచుకున్న పొదుపును ప్రస్తుత ఖర్చులకు మళ్లిస్తూ..అవసరమైతే అప్పులు చేసుకుంటున్నాయి. ధనిక వర్గానికి కొనుగోలు శక్తి ఉండటంతో ధరల పెరుగుదల అంతగా భారంగా అనిపించకపోయినా..మిగిలిన వర్గాలకు మాత్రం ప్రతి రూపాయి ఖర్చు చేయడానికి వెనకా.. ముందు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.
ముందుగా వంటింటి నుంచే..
ధరల పెరుగుదల ప్రభావం ముందుగా కనిపించేది వంటింట్లోనే మూడు నెలల క్రితం కిలో ఉల్లి రూ.25-30 ఉండగా..ఇప్పుడు రూ.60-70 వరకు చేరింది. చక్కెర ధర కిలో రూ.40 నుంచి రూ.60-70కు, బెల్లం కిలో గతంలో రూ.60 ఉండగా ప్రస్తుతం రూ.80కి ఎగబాకింది. పండుగల సీజన్ సమీపిస్తుండగా.. తినుబండారాలు, ఇతర ఆహార పదార్థాల తయారీకి ప్రధానంగా ఈ వస్తువులను వినియోగించాల్సి ఉండటంతో రోజురోజుకూ ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంటుంది.వీటికి తోడు వంటనూనె పాకెట్ ధర గతంలో రూ.170 ఉండగా ప్రస్తుతం రూ.180కు చేరుకుంది.సోనామసూరి బియ్యం క్వింటా రూ.5,400 నుంచి రూ.6,800కు చేరింది.అంటే ఒక్క క్వింటాల్‌పై రూ.1,400 అదనపు భారం పడింది.ఇవి ఒక్కో వస్తువు ధరలు మాత్రమే కాగా..పప్పులు, కూరగాయలు,పాలు వంటి ఇతర నిత్యావసర ధరలు కలిస్తే నెలవారీ బిల్లు గుండెకు నొప్పి తెప్పిస్తోంది.దీంతో గతంలో నెలకు ఒకసారి పెద్ద మొత్తంలో సరుకులు తెచ్చుకునే కుటుంబాలు ఇప్పుడు అవసరమైన మేరకే కొనుగోలు చేస్తున్నాయి.
నియంత్రణపై దృష్టేది.!
రోజువారీ అవసరాల్లో తప్పనిసరిగా కొనుగోళ్లు చేసే వస్తువులు ఒక్కసారిగా పెరగడంతో పేద,సామాన్య కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఆదాయం పెరగకపోయిన నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో నెలాఖరు వచ్చేసరికి ఖర్చులు సర్దుబాటు చేసుకోవడం కష్టతరంగా మారుతోందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. అయితే ధరల పెరుగుదలపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి కృత్రిమ కొరత లేకుండా నిత్యావసర ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ యంత్రంగామ్ వాటితో తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.



