– బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
సామాజిక సేవలో విద్యార్థులు ముందుడాలని, విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంచడంలో ఎన్ఎస్ఎస్ పాత్ర కీలకంగా పని చేస్తుందని హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థిలు నిరాశ నిస్సృహాలకు లోను కాకుండా అనవసరమైన ఆవేశాలకు పోవద్దన్నారు.
హింస మార్గం వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేయడానికి మరియు విద్యార్థుల్లో సేవాభావాన్ని పెంపొందించడానికి 1969లో ఎన్ఎస్ఎస్ ఆవిర్భవించిందన్నారు. విద్యార్థి దశలోనే సేవాభావన్ని అలవర్చుకోవడం ఎంతో ఉత్తమమని అన్నారు. నా కోసం కాదు మీకోసం అనే ధ్యేయ వాక్యం మార్గదర్శకం అని పేర్కొన్నారు. దేశం కోసం, సమాజం కోసం, మన గ్రామం కోసం, మన కళాశాల కోసం చేయగలిగినంత సేవాభావం ప్రతి వాలంటీర్ లో ఉండాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పచ్చదనం భవిష్య తరాలకు మనం ఇచ్చే బహుమతి అని ,ఒక మొక్కను నాటడం అంటే భవిష్యత్ తరాలకు ఒక ప్రాణవాయువును అందించడం అన్నారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దాన్ని తన బాధ్యతగా తీసుకొని పెంచితే ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం యొక్క నిజమైన స్ఫూర్తి నెరవేరుతుందని అన్నారు.
కళాశాల నుండి బయటకు వెళ్లిన తర్వాత కూడా సమాజానికి నేను ఏమి చేయగలను అనే ఆలోచన ప్రతి విద్యార్థులో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చెన్నూరి గంగాధర్ తో పాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి తిరునహరి, రణధీర్ కుమార్, అధ్యాపకులు డాక్టర్ ఎస్. ఎస్. రాజు, సుధగోని సత్యనారాయణ, వి. సదాశివ్, బి.ఎల్లయ్య, బి. వాల్య , ఎస్. వెంకట ముత్యం, సిహెచ్. విద్యాసాగర్, పి. చంద్రమోహన్, సిహెచ్ రాజిరెడ్డి, ఎస్. అశోక్, ఎం వెంకటేష్, ఏ. మమత, గ్రంథ పాలకులు ఆర్.వాసవి, వెంకటసాయి విద్యార్థులు పాల్గొన్నారు.



