వర్షాకాలం మొదలయ్యింది. ఈ కాలంలో రెగ్యులర్‌గా తినే కూరలు నోటికి అంతగా సహించవు. కారంకారంగా, ఏదైనా తినాలనిపిస్తుంది. అందుకే చాలా మంది ఈ కాలంలో పచ్చళ్లకు ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి కొన్ని రుచికరమైన పచ్చళ్లు ఈ రోజు మీకోసం మానవిలో…
అరటిపువ్వుతో…
కావల్సిన పదార్థాలు: అరటిపువ్వు – ఒకటి, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు, నువ్వులు – టీస్పూను చొప్పున, ఎండుమిర్చి – పది, చింతపండు – చిన్న నిమ్మకాయంత, నూనె – తగినంత, ఉప్పు – సరిపడా, ఇంగువ – కొద్దిగా.
పోపు కోసం: ఆవాలు, శనగపప్పు, మినపప్పు – టీస్పూను చొప్పున, ఎండుమిర్చి, రెండు, వెల్లులి రెబ్బలు – నాలుగు, కరివేపాకు – గుప్పెడు, ఇంగువ – చిటికెడు.
తయారు చేసే విధానం: అరటిపువ్వును శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నింటినీ నూనె లేకుండా వేయించి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా నూనె పోసి ఎండుమిర్చి.. తర్వాత అరటిపువ్వును వేయించాలి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టాలి. కడాయిలో నూనె పోసి.. పోపు కోసం సిద్ధం చేసుకున్న దినుసులను వేసి వేయించి పచ్చడిలో కలపాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి.. ఆ పైన కాస్త నెయ్యి వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.
మామిడికాయ ఉల్లిగడ్డ పచ్చడి
కావాల్సిన పదార్థాలు: నూనె – టేబుల్ స్పూను, పల్లీలు – పావు కప్పు, మెంతి గింజలు – 10 నుంచి 15, ఎండుమిర్చి – 15 నుంచి 20(రుచికి తగినన్ని), ధనియాలు – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు – టీస్పూను, జీలకర్ర – పావుటీస్పూను, మామిడికాయ – ఒకటి, ఉప్పు – రుచికి సరిపడా, ఉల్లిగడ్డ – రెండు.
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక పల్లీలను వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత అందులో మెంతులను వేసి కాసేపు వేయించాలి. అవి కూడా వేగిన తర్వాత ఎండుమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకోవాలి. అలాగే ధనియాలు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవన్నీ మంచి రంగు, కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ లోపు ఒక పుల్లటి మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడిగి పైతొక్కను తీసెయ్యాలి. సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పూర్తిగా చల్లారిన ఎండుమిర్చి మిశ్రమం, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కాస్త మెదిగేలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అందులో పెద్ద సైజ్‌లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, మామిడికాయ తురుము వేసుకొని మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్లీ స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసి పోపుని చక్కగా వేయించాలి. తాలింపు వేగాక స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిని అందులో వేసి ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలు. పుల్ల పల్లగా, కారం కారంగా ఉండే ‘ఉల్లి మామిడికాయ పచ్చడి’ రెడీ!
వెజ్ మిక్స్‌డ్ పచ్చడి
కావాల్సిన పదార్థాలు: టేబుల్ స్పూను ఆవాలు, టేబుల్ స్పూను మెంతులు, ఒక క్యాలీఫ్లవర్ తరిగిన ముక్కలు, ఒక క్యారెట్ ముక్కలు, మగ్గించిన రెండు నిమ్మకాయ ముక్కలు, ఒక పచ్చి మామిడికాయ ముక్కలు (ఆప్షనల్), రెండు పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, మూడు టేబుల్ స్పూన్ల ఎండుకారం, రెండు టీ స్పూన్ల మెంతిపిండి, రెండు టీస్పూన్ల ఆవపిండి, రెండు నిమ్మకాయల రసం.
తయారుచేసే విధానం: ముందుగా స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి ఆవాలు, మెంతులని విడివిడిగా వేయించాలి. ఆ తర్వాత వీటిని మిక్సీలో వేసి పొడి పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని తరిగిన క్యాలీఫ్లవర్, క్యారెట్, మగ్గించిన నిమ్మకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి కలపాలి. ఇందులోనే తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఉప్పు, ఎండు కారం, పొడి పట్టిన మెంతిపిండి, ఆవపిండి కూడా వేసి అన్నిటినీ బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో నిమ్మరసం, నూనె వేసి మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు తాలింపు కోసం స్టౌ ఆన్ చేసి ఒక కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు, ఎండు మిర్చి, ఇంగువ వేసి వేయించి పచ్చట్లో వేసి కలుపుకోవాలి. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ నూనె కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్కువ వేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంతే టేస్టీ ఇన్‌స్టంట్ మిక్స్‌డ్ వెజ్ పచ్చడి రెడీ. ఇది అన్నం, రోటి, దోశల్లాంటి వాటిలోకి చాలా బాగుంటుంది.
తొక్కలతో పచ్చడి
కావాల్సిన పదార్థాలు: సొరకాయ తొక్కలు, మధ్యలో భాగం – 300 గ్రాములు, నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు, టమాటాలు – మూడు, పచ్చి మిర్చి – 12-15, శనగపప్పు – టేబుల్ స్పూను, టీ స్పూన్ – జీలకర్ర, వెల్లులి – 10-12, కొత్తిమీర తరుగు – కొద్దిగా, ఉప్పు – రుచికి సరిపడా, చింతపండు – గోళీ సైజంత.
తయారీ విధానం: ఓ కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత శనగపప్పు వేసి ఎర్రగా వేపుకొని.. ఆ తర్వాత జీలకర్ర వేసి చిటపటమనిపించాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి మెత్తబడిన తర్వాత టమాటా ముక్కలు, చింతపండు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరోవైపు అదే కడాయిలో నూనె వేడి చేసి వెల్లుల్లి రెబ్బలు, సొరకాయ తొక్క, మధ్యలో ఉండే భాగం వేసి మెత్తగా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అదే మిక్సీ జార్‌లో వేసి కాస్త ఉప్పు వేసి కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టౌ ఆన్ చేసి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పసుపు, ఇంగువా, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక గ్రైండ్ చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. ఇక చివర్లో కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే అదిరిపోయే తొక్కల పచ్చడి రెడీ!
నోరూరించే పచ్చళ్లు
- Advertisement -
- Advertisement -