భగభగ మండే భానుడి
ఉదయపు హదయ గగనం
నవోదయపు కిరణాలకు
ప్రాణం పోసిన వేళ…
అవని గుండె లోగిలలో
అవి సంలీనమవుతుంటే
ఆకుకూరలమ్మో… కూరగాయలమ్మో …
అంటూ ఓ అవ్వ కూత
నాకు బ్రతుకు విప్లవ గీతమై వినిపిస్తుంది..!
కొన్ని దశాబ్దాల జీవిత ఉద్యమం
బ్రతుకు పోరాట విజయ
పతాకాన్ని ఎగరేస్తుంటే
ఆ అవ్వే కుటుంబానికి బువ్వ పెడుతుంది
ఆకుకూరలు కూరగాయల
కలగలిపిన ఆకలి రంగవల్లికలతో
పండ్ల తోరణాలను అద్ది
సుదూరపు కాలినడక
శబ్దపు సౌందర్యాల మధ్య
జీవన సంగీతాన్ని వినిపిస్తుంటే
సినిమా పాటల సంగీతం వెలవెలబోతుంది..!
ఆ అవ్వ అనుభవపు సాహిత్యం
శ్రీ శ్రీ మహాప్రస్థానాన్నే తలపిస్తుంది..!
పెద్ద సదువుల బతుకులు
బతకడం చేతగాక ఒత్తిడి సంద్రపు గాలుల్లో
నిరాశ నిస్పహల అలల అలజడికి
తనువు సవ్వడిని బిగ్గరగా ఆపేస్తుంటే…
ఈ అవ్వే జీవితవ్యక్తిత్వపు
పాఠ్య శిఖరం అయ్యింది
చీకటి గాఢాంధకారంలో
దాగిన ఇంద్రధనుస్సును చీల్చుతూ
ప్రతి దినం ఉదయానికి
గుండె స్పందనను నేర్పుతూ…
నిండు కర్పూరమై
నిత్య యుద్ధం చేస్తూనే ఉంది
బ్రతుకు సంబరంలో…!
ఆశావాదపు ఆత్మవిశ్వాసపు సౌధంతో..!
– ఫిజిక్స్ అరుణ్ కుమార్, 9394749536
కూర’గాయ’లమ్మో…..!
- Advertisement -
- Advertisement -