గుల్జార్ గురించి రాయడం చాలా ఇష్టమయిన ఒక విచిత్రమైన సవాలు. ఆయన జీవితం సాహిత్యం చూస్తే మనకు ఎంతగా పరిచితుడు అనిపిస్తాడో అంతే కొత్తగా కనిపిస్తాడు. ఆయన కవితలు, పాటలు మన సామూహిక జ్ఞాపకాల్లోకి ప్రవేశించాయి. అవి వర్షం కురుస్తున్నప్పటి సంతోషాన్ని మోసుకొస్తాయి. ప్రేమతో పలుకుతాయి. విరహంతో మౌనందాలుస్తాయి. అంతేకాదు పాఠకుడికి తన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఒంటరితనానికి ఒక స్వరాన్ని ఇస్తాయి. సినిమా, రేడియో, టెలివిజన్, పుస్తకాలు దాదాపు అన్ని మాధ్యమాల ద్వారా ఆయన సాహిత్యం పాటలు తరతరాల భారతీయ అనుభవంలో భాగమైపోయాయి. గుల్జార్ గొప్పతనం కేవలం కవిత్వాన్ని సినిమాకు తీసుకురావడంలో లేదు. సరళమయిన కవిత్వానికి అవసరమైన లోతుని అంతర్ముఖతను, సంకేతాన్ని, అందించడంలో ఆయన ప్రత్యేకత వుంది. ఆయన తన రచనల ద్వారా మన నిత్యజీవితాన్ని మనమే మళ్లీ ఆశ్చర్యంగా చూడటం నేర్పించారు ఆయన కవిత్వంలో ఒక రైల్వే స్టేషన్ భావోద్వేగ భూభాగమవుతుంది. ఒక కిటికీ జ్ఞాపకానికి ద్వారమవుతుంది. వర్షం ఒక సంభాషణగా మారుతుంది. ఎప్పుడో వెళ్లిపోయిన మనిషి ఒక గదిలో మిగిల్చిన నిశ్శబ్దం ఒక కవితగా మారుతుంది. గుల్జార్ కవిత్వం సాధారణ వస్తువుల దగ్గర మొదలవుతుంది. గుల్జార్ సృజనలో అత్యంత ఆకర్షణీయమైన విషయం ఆయన పదచిత్రాలు. సాధారణంగా కవి ఒక భావాన్ని పదాల్లో చెబుతాడు. గుల్జార్ మాత్రం ఆ భావానికి ఒక దృశ్యరూపాన్ని ఇస్తాడు. అందుకే ఆయన కవితలు పాటలు వినిపించడమే కాదు కనిపిస్తాయి.
ఇంకా గుల్జార్‌ను చదివినప్పుడు మనకు పదేపదే ఎదురయ్యేది ‘జ్ఞాపకం’. వర్తమానంలో ఉన్న మనిషి వెనక్కి చూస్తాడు. గతంలో జరిగిన ఒక చిన్న సంఘటన అతని వర్తమాన జీవితాన్ని మార్చేస్తుంది. ఒక పాత వస్తువు. ఒక పాత పాట. ఒక పాత వీధి. ఒక పాత ఉత్తరం. ఒక పాత ప్రేమ. ఇవేవీ గతంలోనే ఉండిపోవు. గుల్జార్ రచనల్లో ‘గతం వర్తమానంలోకి తిరిగి వచ్చే జ్ఞాపకం’లా వుంటుంది. అందుకే ఆయన రచనలో కాలం సరళరేఖలా ఉండదు. గతం, వర్తమానం ఒకదానిలోకి మరొకటి ప్రవేశిస్తాయి. ఇది బహుశా ఆయన చూసిన దేశ విభజన కాలం నాటి అనుభవంతో వచ్చి వుంటుంది. ఆయన బాలుడిగానే తాను పుట్టిన నేలను వదిలి రావడం, దేశ విభజనలో హింసను చూడడం, వలస జీవితం, కోల్పోయిన పరిచయాలు ఇలాంటి అనేక అనుభవాలు గుల్జార్ మనసులో చెరపలేని ముద్రలుగా మిగిలాయి. అవి ఆయన రచనల్లో అంతర్లీనంగా సున్నితత్వంగా మారాయి. ఒకరకంగా సీరియస్ సాహిత్యం, ప్రజాదరణ పొందిన సినీ సంస్కృతులను మనం తరచూ వేర్వేరు ప్రపంచాలుగా చూస్తుంటాం. కవిత ఒక పుస్తకంలో ఉండాలి. పాట సినిమా కోసం. కథ పత్రికకు లేదా సినిమా కోసం కావాలి అని భావిస్తాం. కానీ ఈ హద్డులన్నింటినీ గుల్జార్ చెదరగొట్టాడు. ఆయన కవి. గేయరచయిత. దర్శకుడు.
కథకుడు. స్క్రీన్‌ప్లే రచయిత. కవితా రూపాలపై ప్రయోగాలు చేసిన సృజనకారుడు. హిందీ–ఉర్దూ సాహిత్య సంప్రదాయాల్లో లోతుగా వేళ్లూనుకుని, అదే సమయంలో హిందీ సినిమా అనే అత్యంత ప్రజాదరణ పొందిన మాధ్యమం ద్వారా సాహిత్యాన్ని కోట్లాది మంది ప్రేక్షకుల అనుభవంలోకి తీసుకెళ్లిన రచయిత. ఇది మౌలికంగా ఆయన సృజనాత్మక స్వభావం. గుల్జార్ కవిత్వం గురించి మాట్లాడేటప్పుడు ఆయన క్లుప్తతను గురించి మాట్లాడాలి. ఎక్కువ మాటలు చెప్పడం సాహిత్య గొప్పతనం కాదు. ఒక చిన్న పంక్తి మనలో పెద్ద అనుభూతిని రేపగలిగితే అదే కవిత్వం. గుల్జార్ కూడా ‘అధికంగా చెప్పడం కంటే తక్కువ మాటల్లో ఎక్కువ చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తానని’ పలు సార్లు చెప్పారు. అది ఇది ఆయన పాటల్లోనూ కనిపిస్తుంది. సంభాషణల్లోనూ కనిపిస్తుంది. కవితల్లోనూ కనిపిస్తుంది. చెప్పిన దానికంటే చెప్పకుండా వదిలినదే కొన్నిసార్లు ఎక్కువ మాట్లాడుతుంది. నిజానికి గుల్జార్ ప్రయాణం ఒకే దారిలో సాగలేదు. మొదట రచన. తర్వాత పాట. తర్వాత సంభాషణ. తర్వాత దర్శకత్వం. మరోవైపు కవిత్వం. మరోవైపు అనువాదం. టెలివిజన్‌లో మరో సృజనాత్మక ప్రపంచం.‘మిర్జా గాలిబ్’ వంటి టెలివిజన్ సీరియల్స్ లో గాలిబ్ జీవితం, కవిత్వాన్ని దృశ్యరూపంలో ఆవిష్కరించడం ఆయన సాహిత్యాభిరుచికి మరో ఉదాహరణ.
ఇది గుల్జార్ బహుముఖ ప్రజ్ఞ మాత్రమే కాదు. ఒక కళ మరొక కళ ఎలా చోదక శక్తి అవుతుందో చూపించే సృజనాత్మక ప్రయాణం. కవిత్వం ఆయన సినిమాను ప్రభావితం చేసింది. సినిమా ఆయన కవిత్వానికి దృశ్యాన్ని ఇచ్చింది. సంగీతం ఆయన పదాలకు శరీరమైంది. భాష ఆయనకు ప్రపంచాన్ని పరిచయం చేసింది. గుల్జార్ సృజనలో అనువాదం ఒక ప్రత్యేకమైన అధ్యాయం. భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే భారతీయ భాషల్ని వినాలి. ప్రతి భాషలో ఒక ప్రాంతం ఉంటుంది. ప్రతి ప్రాంతంలో ఒక జీవితం ఉంటుంది. ప్రతి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంటుంది. ఆ అనుభవాలు ఒక భాషలోనే బంధించబడిపోతే దేశం తనలోని ఒక భాగాన్ని కోల్పోతుంది. గుల్జార్ అనువాదాల ద్వారా ఆ గోడలను కొంతవరకు తొలగించే ప్రయత్నం చేశారు. వివిధ భారతీయ భాషల సమకాలీన కవులను ఒకే సంకలనంలో పరిచయం చేయడం ఆయన సాంస్కృతిక దృష్టికి నిదర్శనం‘A Poem a Day’లో 34 భారతీయ భాషలకు చెందిన 279 మంది కవుల 365 కవితలను అనువాదం చేసాడాయన. ఇది భారతదేశాన్ని ఒక భాష నుంచి మరో భాషలో వినిపించే ప్రయత్నం.
ఒక తెలుగు కవి తన మలయాళీ సోదరుడి కవితను చదవడం, ఒక బెంగాలీ కవి పంజాబీ కవితలో తన అనుభవాన్ని గుర్తించడం ఇదే నిజమైన సాంస్కృతిక ఏకత్వం. గుల్జార్‌కు సినిమా రంగంలో జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఆస్కార్, గ్రామీ, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వంటి అనేక గౌరవాలు ఆయనకు లభించాయి. సాహిత్య రంగంలో సాహిత్య అకాడెమీ పురస్కారం, పద్మభూషణ్ వంటి గౌరవాలు కూడా అందుకున్నారు. అంతేకాదు గుల్జార్‌కు లభించిన 58వ జ్ఞానపీఠ పురస్కారం ఆయనకు అందిన గొప్ప గౌరవం. గుల్జార్‌ను చూస్తే నాకు ఒక గొప్ప అందమయిన వంతెన గుర్తుకొస్తుంది. ఒక వైపు సాహిత్యం. మరో వైపు సినిమా. ఒక వైపు హిందీ, మరో వైపు ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, ఇతర భారతీయ భాషలు. ఒక వైపు శబ్దం. మరో వైపు నిశ్శబ్దం. ఒక వైపు గతం. మరో వైపు వర్తమానం. ఆ రెండు నదుల మధ్య నడుస్తూ, వాటిని కలుపుతూ వెళ్తున్న మనిషి గుల్జార్. ఆయన పాట ఒక చిన్న కవిత. ఆయన కవిత ఒక దృశ్యం. ఆయన దృశ్యం ఒక జ్ఞాపకం. ఆ జ్ఞాపకం చివరికి మన జీవితంలోకి వచ్చి చేరుతుంది. అందుకే గుల్జార్‌ను చదవడం అంటే కేవలం ఒక కవిని చదవడం కాదు.
మనలో ఎప్పుడో మరచిపోయిన ఒక మనిషిని మళ్లీ కలుసుకోవడం. అదే గుల్జార్ సృజనకు ఉన్న చిరస్థాయితనం.
వారాల ఆనంద్



