ఎండిపోయిన ఆశల కొమ్మలపై ఎవరో
రహస్యంగా ఒక పచ్చని అక్షరం రాశారు
అది చిగురైంది….
నిన్నటి వరకు మనుషుల అడుగులతో
మాట్లాడిన రోడ్డు ఈరోజు నిశ్శబ్దాన్ని
కప్పుకుంది…
ప్రపంచం నిద్రపోయింది…
కానీ శ్వాస మాత్రం కనురెప్పలలో
రేపటి ఉదయాన్ని స్వప్నిస్తోంది
బోసిపోయిన రోడ్డు ఒడిలో ఒక చిన్న చిగురు
పచ్చని నవ్వు నవ్వింది.
ఆశ… అది ఆకాశం నుంచి రాలే వెలుగు కాదు
పడిపోయిన మనిషి తన నీడను దాటి
మరో అడుగు వేయడానికి లోపల నుంచి
వినిపించే చిన్న పిలుపు.
కాలం నెమ్మదిగా తన పాదాలను
కదిలించింది.
గాలి నిన్నటి వాసనను వదిలి
కొత్త పరిమళాన్ని మోసుకొచ్చింది.
చీకటి గుండెలో ఒక వెలుగు కిరణం
తన దారి తానే చేసుకుంది.
కోల్పోయిన పచ్చదనం తిరిగి చెట్లకే కాదు….
మనిషి లోపలి జీవితాన్ని చిగురింపజేస్తోంది.
రోడ్డు ఖాళీగా ఉంది…అయినా భయం లేదు.
ఎందుకంటే నిశ్శబ్దం అంతిమం కాదు
అది ఒక పాట పుట్టే ముందు ప్రపంచం
తీసుకునే దీర్ఘమైన ఊపిరి.
ఆ ఊపిరి చివర వసంత కోకిల
తన గొంతు విప్పింది.. ఒక పాట పాడింది
ఆ పాట రోడ్డును నింపలేదు
కానీ మనిషి గుండెల్లో ఏళ్లుగా
మూసుకుపోయిన ఒక తలుపును
తెరిచింది ఆగిపోయిందనుకున్న కాలాన్ని
మళ్లీ నడిపించింది
పైన ఆకాశం నీలి మేఘాల చీర కప్పుకుని
ఏదో పండుగ కోసం ఎదురుచూస్తోంది.
అంతలో ఒక చినుకు చాలా చిన్నది కానీ
ఎండిపోయిన భూమికి అది ఒక సముద్రం
విరిగిపోయిన మనసుకు అది ఒక హామీ
ఆశగా మారిన ఆ చినుకు భూమిని తడిపింది…
మనసును తడిమింది…ఎండిపోయిన కొమ్మల
మధ్య మళ్లీ ఒక చిగురు నిశ్శబ్దంగా నవ్వింది.
అప్పుడు తెలిసింది….
వసంతం రావడం కాదు ఆశ
వసంతం వస్తుందని
ఎండిన కొమ్మ కూడా
చిగురును దాచుకోవడమే
ఆశ…..
ప్రమోద్ ఆవంచ, 7013272452
ఆశ…
- Advertisement -
- Advertisement -



