Sunday, September 6, 2026
E-PAPER
Homeదర్వాజఅక్షరాల పెట్టె

అక్షరాల పెట్టె

- Advertisement -


మై డియర్ దోస్త్… ఎలా ఉన్నావ్
జీవిత మలుపుల్లో ఎక్కడో చిక్కుబడిపోయినట్లున్నావ్
చాన్నాళ్ళయింది నిన్ను విని
అందరాని చందమామవయ్యావ్
ఇదుగో
నీకోసమే కొన్ని మాటలను ప్రోది చేసాను
నీ కనుపాపైన నీ చిన్నారిని చూసుకున్నంత సుకుమారంగా
నేనూ వాటిని జాగ్రత్తగానే భద్రపరిచాను
నీ విలువైన సమయాల్లో
అర క్షణమైనా వాటికోసం వెచ్చించి
ఎప్పుడో ఒకప్పుడు ఈ అక్షరాల పెట్టెను తెరిచి చూడు
తెరుస్తావ్ కదూ
పూవులనుంచి తుమ్మెదలు
మకరందం స్వీకరించినంత మెత్తగా నీవూ సిద్ధమైపో
నన్ను చదవడానికే సుమా
గుంపులోంచి తప్పిపోయిన గొర్రె పిల్లలా
నీవు పడుతున్న బాధ నన్ను నిలువనీయడం లేదు
నిన్ను గురించిన దిగులు మేఘాలు
నిత్యం కలవర పెడుతున్నాయి
ఆగిపోయావేం, మరి కాస్త చదువు
ఉద్వేగంగా పరుగెత్తే అక్షరాలను వెంటాడుతూ నీ కళ్ళు 360 డిగ్రీలలో నన్ను మాత్రమే వెంబడిస్తూ నీ మెదడు
ఏదో జుగల్బందీలో కొట్టుకుపోయావ్ కదూ కాసేపు
కాసేపేలే, ఫరవాలేదు
నిన్ను నీవు మరిచిన ఈ క్షణాలు గొప్పవి
కెలొడీస్కోప్ లో కనిపించే ప్రపంచమేం అందమైనది కాదు తప్పిపోయినంత మాత్రాన కోల్పోయినట్లు కాదు
వితౌట్ ఎడిట్స్ తో
రా అండ్ రస్టిక్ దునియానే మన చుట్టూ ఇప్పటికీ అలుముకునే ఉంది
రా నేస్తం
ఏ ఫాంటసీలు మనను మార్చలేవు
ఎటువంటి షార్ట్ కట్స్ లేని గ్రౌండ్ రియాలిటీలో
మనను మనం దిద్దుకుందాం
ఎక్కడో ఆగిపోయినట్లుందా
స్టార్ట్ బటనే కనిపించని ఫుల్ లెంగ్త్ లో
పాజ్ మోడ్ లో బతికేస్తున్నావా
దిగులు పడకు
ఫుల్ ఆన్ లైఫ్ ఎక్స్ప్రెస్ జర్నీలో స్టాప్ అంటూ ఉండాలి
కొత్తవారు ఎక్కడమో, పాతవారు దిగిపోవడమో
లేకపోతే
రైలు ప్రయాణంలో మజా ఏముందసలు?
ఇంతకీ పెట్టె తెరిచి ఏం చూసావ్
నిన్ను నువ్వు చూసుకున్నావా
నన్ను చూసావా
అద్దం కనిపించిందా
నీకు నీవే తోడైనప్పుడు నీ అంతరంగాన్ని
నిన్ను తప్ప మరింకేం చూపగలను
నేస్తం, సీతాకోకకు తెలుసు
జీవితంలో ఇంద్రధనస్సులు విరియాలంటే
మారాల్సిన దశలెన్నో
శిలకు తెలుసు ఉలి దెబ్బలు ఎన్ని పడితే అందమైన శిల్పంగా మారిందో నీకు తెలుసు
కాలచక్రంలో నీ ప్రయాణం నీ గమ్యం నీ లక్ష్యం
వాటిని చేరుకునే మార్గం మరింత బాగా తెలుసు
ఆగిపోవడం పోగొట్టుకోవడం కాదు
ఏదీ మారలేదు
ఏ దశలోనూ మార్పు లేదు
అవే వసంతాలు, అవే గ్రీష్మాలు
కొద్దిగా దిగులు గూటిని వదిలి చూడు నేస్తం
క్షణక్షణానికి నీవే ప్రపంచంతో పరివ్యాప్తమవుతావు
ఎందుకంటే, నీకు నీవే విశ్వాసం, నీకు నీవే సైన్యం
నీ అంతరంగాన్ని నీవు మాత్రమే విశ్లేషించగలవు
ఎస్, అద్దంలో నేను కనిపిస్తున్నాను కదూ
నేనే నీవైనప్పుడు నీవే నేను అయినప్పుడు
ఇంకెవరు కనిపిస్తారు ఇంకెవరు వినిపిస్తారు
నీ ద్వైదీభావ సంఘర్షణను ఇక విడిచెయ్
నీ లోపల బందీగా ఉన్న నిన్ను నీవే విడుదల చేయ్
ఊపిరి పీల్చుకో
వేయి సీతాకోకలై గాల్లో ఎగురుతున్నట్లు మనసును తేలిక చేసుకో
అంతరాత్మగా ఇదొక్కటే చెప్పగలను నేస్తం
నస్రీన్ ఖాన్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -